Begin typing your search above and press return to search.

తెలంగాణ యువతకు ఇది శుభవార్తే!

By:  Tupaki Desk   |   8 Oct 2017 10:40 AM GMT
తెలంగాణ యువతకు ఇది శుభవార్తే!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి యువతకు, ప్రధానంగా ఉద్యోగార్థులకు ఒక చల్లటి వార్తను ప్రకటించారు. ప్రధానంగా ఈ కబురు వెనుకబడిన ప్రాంతాల వారికి, తెలంగాణలోని మారుమూల జిల్లాల వారికి కీలకమైనది. వారి భవిష్యత్తుకు సంబంధించినది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జోన్ల విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. జిల్లాలు పెరిగిన నేపథ్యంలో ఈ విషయంలో జోన్లు కూడా పెంచాలని, దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ కూడా చేయించాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను రాబట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలుగురాష్ట్రాలకు సంబంధించి.. ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానం చాలా కీలకంగా ఉంటోంది. ఉద్యోగాలన్నీ ఒకే ప్రాంతం వారికి లేదా, నగరాల్లో మెరుగైన విద్యావకాశాలు ఉన్న వారికి మాత్రమే దక్కకుండా.. అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగాలు అందరికీ దక్కేలాగా ఈ జోనల్ విధానం వెనుకబడిన ప్రాంతాల వారి ప్రయోజనాలను కాపాడుతూ వస్తోంది. ప్రధానంగా హైదరాబాదులోఉద్యోగాలకు సంబంధించిన నియామకాల విషయంలో అందరికీ అవకాశాలు దక్కేలా ఈ విధానాన్ని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రూపొందించారు.

అయితే తెలగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత.. జోనల్ సిస్టమ్ కు విలువ లేదు అనే వాదన మొదలైంది. జోనల్ విధానం లేకపోతే గనుక.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్ పడినా సరే.. హైదరాబాదులో చదువుకున్న విద్యార్థులు వెళ్లి అక్కడ పోటీపరీక్షలు రాసి.. తామే అవకాశాలను దక్కించుకునే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రాలైతే వేరు పడ్డాయి గానీ.. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాల వారీ వెనుకబాటుతనం పూర్తిగా సమసిపోలేదు. అలాంటి నేపథ్యంలో జోనల్ సిస్టమ్ లేకపోతే.. నష్టం జరుగుతుందనే వ్యతిరేకత కూడా వచ్చింది.

తాజాగా జోనల్ విధానానికి సీఎం కేసీఆర్ జై కొట్టారు. ఈ పద్ధతిని కొనసాగించడం మాత్రమే కాదు. రాష్ట్రంలో జిల్లాలు పెరిగిన నేపథ్యంలో.. జోన్ల సంఖ్యను కూడా పెంచి.. వెనుకబడిన ప్రాంతాల యువతరానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. అందుకే చాలా మీమాంస తరువాత.. తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్తే వచ్చిందని అంతా అనుకుంటున్నారు.