Begin typing your search above and press return to search.

షిండే.. బొండేలు.. మా కాన చెల్ల‌వ్‌.. : కేసీఆర్ హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   12 Sep 2022 10:34 AM GMT
షిండే.. బొండేలు.. మా కాన చెల్ల‌వ్‌.. :  కేసీఆర్ హాట్ కామెంట్స్‌
X
ప్ర‌ధాని మోడీపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌.. ఇదే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వంపైనా విరుచుకుప‌డ్డారు. రాష్ట్ర ఆర్టీసీని అమ్మేయాలని త‌న‌కు కేంద్రం నుంచి నోటీసులు వస్తున్నాయని, కేంద్రం లెటర్ల మీద లెటర్లను పంపిస్తోందని అన్నారు. ఆర్టీసీని అమ్మేస్తే వెయ్యికోట్లు బహుమతి ఇస్తామంటున్నారని అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు. "కేంద్రం అన్నీ అమ్మేస్తోంది. దీనికి సంస్కరణలు అని అందమైన పేరు పెట్టారు. విద్యుత్‌, వ్యవసాయ రంగాన్ని షావుకార్లకు అప్పగించాలని మోడీ సర్కార్‌ చూస్తోంది. " అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తెలంగాణ స‌ర్కారును కూల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇదే జ‌రిగితే.. మీకు పోయే కాలం వచ్చిన‌ట్టేన‌ని విరుచుకుప‌డ్డారు. "అందరూ కలిస్తే మీరు ఉంటారా?. షిండేలు, బొండేలు అని ఎవరిని బెదిరిస్తున్నారు. షిండే.. బొండేలు.. మాకాన చెల్ల‌వ్‌. హిట్లర్‌ వంటి వారే కాలగర్బంలో కలిసిపోయారు. వీళ్లను దేవుడు కూడా కాపాడలేడు. భారతమాత గుండెకు గాయమవుతోంది. జాతీయ జెండానే మార్చేస్తామని చెబుతున్నారు. ఏక పార్టీనే ఉంటుందని చెప్తున్నారు" అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇంధన ఖర్చులు తగ్గించుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం అన్నారు. కేంద్రం అన్నింటినీ అమ్మేస్తోందని, వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయని ధ్వజమెత్తారు.

ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం మాయ మాటలు చెబుతోందన్నారు. రైతులు వ్యవసాయం చేయలేమంటే.. కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దించాలని కేంద్రం ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు.

సౌరశక్తి పేరుతో విద్యుత్ వ్యవస్థను బడాబాబులకు అప్పగించేందుకు చర్యలు చేప‌ట్టార‌ని విమ‌ర్శించారు. చెత్తను వాడుకుని కూడా అద్భుతంగా విద్యుత్ తయారుచేయవచ్చున‌ని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ‌లో పుష్కలంగా చెత్త ఉందన్న ఆయ‌న‌.. దాంతో కావాల్సిన విద్యుత్ తయారుచేయవచ్చున‌న్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ విధానం వల్ల అంధకారంలోకి పోతున్నామని హెచ్చ‌రించారు. బోర్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని బలవంతం చేస్తున్నారన్నారు. మేకిన్ ఇండియా అనేది పూర్తి అబద్ధపు ప్రచారంగా పేర్కొన్నారు. మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.