Begin typing your search above and press return to search.

కొంగ‌ర్ లో వ‌ర్షం..శ‌కున‌మా..అప‌శ‌కున‌మా?

By:  Tupaki Desk   |   2 Sep 2018 4:27 AM GMT
కొంగ‌ర్ లో వ‌ర్షం..శ‌కున‌మా..అప‌శ‌కున‌మా?
X
రుచిక‌ర‌మైన భోజ‌నం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వేళ‌.. అనుకోని రీతిలో వ‌చ్చే చిన్న రాయితో మూడ్ ఎంత‌గా మారుతుందో.. కొంగ‌ర్ స‌భ‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ.. పూర్తి అయిన ప‌నులను చూసి మురిసిపోతున్న వేళ‌.. ఊహించ‌ని ఉత్పాతంలా విరుచుకుప‌డ్డ వ‌ర్షం.. ఈదురు గాలులు గులాబీ శ్రేణుల్ని నీర‌సానికి గురి చేశాయి. అనుకున్న ప‌ని అనుకున్న‌ట్లుగా పూర్తి కావాల్సిందంతే అన్న‌ట్లుగా కేసీఆర్ తీరుకు ప్ర‌కృతి స‌వాల్ విసిరిన‌టైంద‌న్న మాట ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది.

ఎవ‌రినైనా త‌న దారికి తెచ్చుకునే స‌త్తా ఉన్న కేసీఆర్ కు.. ప్ర‌కృతి తాజాగా స‌వాలు విసిరింద‌న్న చ‌ర్చ షురూ అయ్యింది. కొంగ‌ర్ స‌భ ద‌గ్గ‌ర కురిసిన భారీ వ‌ర్షంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా కురిసిన వ‌ర్షం మంచి శ‌కునంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. వ‌ర్షంతో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా.. ఒకందుకు మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

పాతిక ల‌క్ష‌ల మంది ఒక చోట‌కు చేరిన వేళ‌.. భారీగా దుమ్ము రేగే అవ‌కాశం ఉంద‌ని.. తాజాగా కురిసిన వ‌ర్షం పుణ్య‌మా అని కొంత ఇబ్బంది ఎదురైనా.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టానికి.. దుమ్మురేగ‌కుండా ఉండ‌టానికి వాన కార‌ణ‌మ‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది. వ‌ర్షం శుభ సూచ‌క‌మ‌ని.. త‌మ స‌భ‌కు వాన‌దేవుడు సైతం హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా గులాబీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఆశావాహుల మాట‌లు ఇలా ఉంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇందుకు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. స‌భ‌కు కొన్ని గంట‌ల ముందు కురిసిన వ‌ర్షం.. ఈదురు గాలులు అప‌శ‌కునంగా అభివ‌ర్ణిస్తున్నారు. నాలుగు జ‌ల్లులు కురిస్తే మ‌రోలా ఉండేది. కానీ..కొంగ‌ర్ ద‌గ్గ‌ర కురిసింది భారీ వ‌ర్షం. పెద్ద ఎత్తున ఈదురు గాలులు చోటు చేసుకున్నాయి. ఇది క‌చ్ఛితంగా కేసీఆర్ ను ప్ర‌కృతి హెచ్చ‌రిస్తోంద‌న్న మాట కొంద‌రి నోటి నుంచి వ‌స్తోంది. దీనికి వారు ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

2004లో ముంద‌స్తు వెళ్ల‌టానికి ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు ప్లాన్ చేయ‌టం.. ఆ సంద‌ర్భంగా తిరుప‌తిలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. అయితే.. స‌భ ప్రారంభానికి ఒక్క రోజు ముందు భారీ ఎత్తున కురిసిన వ‌ర్షం.. వీచిన ఈదురుగాలుల కార‌ణంగా స‌భా ప్రాంగ‌ణం మొత్తం చింద‌ర‌వంద‌ర‌గా మారింది. నాటి గాలుల ప్ర‌భావానికి ఫ్లెక్సీలు.. క‌టౌట్ లు ప‌డిపోయాయి. దీన్ని అప‌శ‌కునంగా అప్ప‌ట్లో ప‌లువురు అభివ‌ర్ణించ‌టం.. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబు ఓడిపోవ‌టం జ‌రిగింది. ఇదే విష‌యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

నాడు తిరుప‌తిలో జ‌రిపిన స‌భ‌కు.. నేడు కొంగ‌ర్ లో నిర్వ‌హిస్తున్న స‌భ‌కు చాలా పోలిక‌లు ఉన్నట్లు చెబుతున్నారు. తిరుప‌తి స‌భ నాటికి బాబులో భారీ కాన్ఫిడెన్స్ ఉండ‌ట‌మే కాదు.. త‌న‌కు మించినోళ్లు లేర‌న్న భావ‌న ఉండేద‌ని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లోనూ ఇదే తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న విష‌యాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ వాద‌న‌ను తిప్పి కొడుతున్న వారు కూడా లేక‌పోలేదు. తిరుప‌తిలో నిర్వ‌హించిన స‌భ వ‌ద్ద కురిసిన వ‌ర్షానికి భారీ డ్యామేజ్ జ‌రిగింద‌ని.. కానీ.. కొంగ‌ర్ స‌భ‌లో అలాంటిదేమీ లేద‌ని.. స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద వ‌ర్షం నిల‌వ‌టం.. ఒక‌ట్రెండు కటౌట్లు కూలిపోవ‌టం మిన‌హా మిగిలిన‌దంతా బాగానే ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. మ‌రీ.. ముఖ్యంగా శివారులో ఏర్పాటు చేసిన వేదిక కావ‌టంతో.. గాలుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలా.. రెండు వ‌ర్గాల వారు పోటాపోటీ వాద‌న‌తో వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. మ‌రి.. కొంగ‌ర్ లో వీసిన గాలులు.. ప‌డిన వ‌ర్షం మంచి శ‌కున‌మా? అప‌శ‌కున‌మా? అన్న‌ది కాల‌మే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికైతే తీర్పు వాయిదా వేయ‌టం స‌మంజ‌సం.