Begin typing your search above and press return to search.

సారు డిసైడ్‌?.. రాజ్‌భ‌వ‌న్ ముఖ‌మే చూడ‌ర‌ట‌!

By:  Tupaki Desk   |   24 July 2019 5:12 AM GMT
సారు డిసైడ్‌?.. రాజ్‌భ‌వ‌న్ ముఖ‌మే చూడ‌ర‌ట‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కోపం వ‌చ్చింద‌ట‌. తానెంతో గౌర‌వించి.. మ‌ర్యాద ఇచ్చిన పెద్ద మ‌నిషి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఇచ్చిన షాక్ నుంచి గులాబీ బాస్ ఇంకా తేరుకోలేదంటున్నారు. తానెంతో మ‌న‌సు పెట్టి త‌యారు చేసి.. యుద్ధ ప్రాతిప‌దిక‌న బిల్లుగా తీసుకొచ్చి.. అసెంబ్లీ నిర్వ‌హించి మ‌రీ ఆమోద ముద్ర వేసిన బిల్లును చ‌ట్టం కాకుండా కొర్రీలు పెట్టి చేతులు అడ్డంపెట్టి ఆపిన న‌ర‌సింహ‌న్ తీరుపై ఆయ‌న గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

స్నేహితుడ్ని క‌లిసిన చందంగా.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి నేరుగా రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి గంట‌ల కొద్దీ క‌బుర్లు చెప్పుకునే మిత్రుడు న‌రసింహ‌న్ ఇలా చేస్తార‌ని కేసీఆర్ క‌ల‌లో కూడా అనుకోలేద‌న్న మాట టీఆర్ఎస్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

బిల్లును తాను ద‌గ్గ‌రుండి.. లైన్ బై లైన్ చ‌దివి మ‌రీ ఓకే చేస్తే.. అందులో గ‌వ‌ర్న‌ర్ ఎత్తి చూపిన కొర్రీలపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గ‌వ‌ర్న‌ర్ తిప్పి పంపిన వైనంపై విప‌క్షాలు విప‌రీత‌మైన ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. దీనంత‌టికి కార‌ణ‌మైన న‌రసింహ‌న్ తీరును త‌న స‌న్నిహితుల వ‌ద్ద కేసీఆర్ త‌ప్పు ప‌ట్టినట్లు చెబుతున్నారు.

ప‌లుమార్లు మున్సిప‌ల్ అధికారులతో భేటీ అయి మ‌రీ తయారు చేసిన బిల్లులో త‌ప్పుల‌కు అస్కారం లేద‌న్న మాట కేసీఆర్ నోట వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇదంతా రాజ‌కీయంగా త‌మ బాస్ ను దెబ్బ తీయ‌టానికి చేస్తున్న ప‌నిగా గులాబీ నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ మైండ్ సెట్ తెలిసిన వారంతా.. తాజాగా ఎదురైన ప‌రిస్థితికి ఆయ‌న రియాక్ట్ అయ్యే తీరు.. తీసుకునే నిర్ణ‌యాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు. రానున్న‌రోజుల్లో మ‌రీ త‌ప్ప‌దంటే త‌ప్పించి.. గ‌తంలో మాదిరి అదే ప‌నిగా రాజ్ భ‌వ‌న్ వైపు వెళ్లే ప‌నే చేయ‌ర‌ని చెబుతున్నారు. త‌మ సారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఫీలైన బిల్లును వెన‌క్కి పంప‌టంతోనే గ‌వ‌ర్న‌ర్ తో ముచ్చ‌ట్లు పెట్టే కార్య‌క్ర‌మానికి బంద్ పెట్ట‌టం ఖాయ‌మ‌ని.. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో మ‌రిన్ని ప‌రిణామాల‌కు కార‌ణంగా మారుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.