Begin typing your search above and press return to search.

కేసీఆర్.. చేతలకు సిద్ధమయ్యారా?

By:  Tupaki Desk   |   26 Sep 2016 7:38 AM GMT
కేసీఆర్.. చేతలకు సిద్ధమయ్యారా?
X

మిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలిక పెట్టే ప్రయత్నం చేస్తే ఇబ్బందే. ఎందుకంటే.. ఆయన మార్క్ భిన్నంగా ఉంటుంది. మాటలు ఎంతగా చెబుతుంటారో.. కొన్ని సందర్భాల్లో చేతలు సైతం అంతే ఫాస్ట్ గా ఉంటాయి. మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి అయింట్ మెంట్ మాటలు అస్సలు మాట్లాడరు. తాను చేసే వ్యాఖ్యల కారణంగా ప్రజల మనసులకు గాయాలు తగులుతాయని తెలిసినా అలాంటి మాటలు మాట్లాడేందుకు ఆయ‌న‌ ఏ మాత్రం వెనుకాడరు. కొంత మంచి చేసేటప్పుడు కొంతమందికి కష్టం కలుగుతుందన్న విషయాన్ని కేసీఆర్‌ సంపూర్ణంగా విశ్వసిస్తారు. ఆ విషయాన్ని మాటలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నించకుండా.. నిష్ఠూరంగా ఉండే నిజాన్ని చెప్పేస్తారు.

అంతటి ధైర్యం.. తెగువ.. సాహసం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే తీసుకుంటే... అతిభారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్కూళ్లకు రెండు రోజులు ప్రభుత్వమే సెలవు ప్రకటించిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆక్రమణలకు గురైన నల్లాలు.. చెరువులతో నీట మునిగిన పలు భవనాల విషయంలో తాను కఠిన చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్ మాటల్ని చాలామంది పట్టించుకోకపోయినా.. కొందరుమాత్రం అండర్ లైన్ చేసుకున్నారు. ఎందుకంటే.. ఇలాంటి ఇష్యూలలో కేసీఆర్ నోటి నుంచి మాట వచ్చిందంటే.. దాని అంతు చూస్తారనటంలో ఎలాంటి సందేహం ఉండదు. అక్రమ కట్టడాల్ని కూల్చివేసే విషయానికి సంబంధించి కొన్ని కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయని.. ఈ విషయం మీద తాను హైకోర్టు ప్రధానన్యాయమూర్తిని కలుస్తాన్న మాటను శనివారం మీడియా సమావేశంలో చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే ఆదివారం సాయంత్రం కలవటం హాట్ టాపిక్ గా మారింది.

విపత్తు చోటు చేసుకున్నప్పుడు అక్రమాల‌ను ప్రభుత్వం ఊసూక్షించ‌ద‌ని.. చర్యలు తప్పవని చెప్పటం మామూలే. ఆ వేడి తగ్గాక తాము చెప్పిన మాటల్ని మర్చిపోవటం పాలకులకు మామూలే. కానీ.. కేసీఆర్ ఆ కోవకు చెందినవారు కాదు. అందుకే మాటలు చెప్పిన మ‌రునాడే చేతలు మొదలైనట్లుగా చెబుతన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ దేని గురించి అన్నది అధికారిక సమాచారం లేనప్పటికీ.. నాలాలపై కట్టిన అక్రమ కట్టడాలకు సంబంధించి కోర్టులలో పెండింగ్ ఉన్న కేసుల ఇష్యూ తేల్చటానికి.. పరిస్థితి తీవ్రత ఆయనకు అర్థమయ్యేలా చెప్పటానికే ఈ భేటీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ లో విలక్షణ కోణాన్ని చెప్పాల్సి వస్తే.. విపత్తుతో ఆగమాగమైన బాధితుల వద్దకు వెళ్లేందుకు ఏ మాత్రం ఇంట్రస్ట్ ప్రదర్శించని ఆయన.. విపత్తుకు కారణమైన అసలు కారణంపై ఫోకస్ చేస్తూ.. దాని సంగతి చూసేందుకు వీలుగా అడుగులు వేయటం కనిపిస్తుంది. ఇలాంటి చ‌ర్య‌లే కేసీఆర్ ను మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా నిలుపుతాయనటంలో సందేహం లేదు.