Begin typing your search above and press return to search.

కేసీఆర్ పేప‌ర్లు చ‌దువుతారా? చూస్తారా?

By:  Tupaki Desk   |   23 Feb 2019 9:31 AM GMT
కేసీఆర్ పేప‌ర్లు చ‌దువుతారా?  చూస్తారా?
X
ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తికి ఉండే సౌక‌ర్యాలు.. స‌దుపాయాలు.. చేతిలో ఉండే ప‌వ‌ర్ చూసి గొప్ప‌గా పీల‌వుతారు. కానీ.. ఆ స్థానంలో ఉన్న వారు ఎంత ఎక్స్ ర్ సైజ్ చేయాల‌న్న విష‌యాన్ని చాలామంది ప‌ట్టించుకోరు. చాలామందిలో అత్యున్న‌త స్థానం గురించి అతిగా ఊహించుకుంటారే కానీ.. ఆ స్థానానికి చేరుకోవ‌టానికి.. చేరుకున్న త‌ర్వాత దాన్ని నిల‌బెట్టుకోవ‌టానికి వారు ప‌డే శ్ర‌మ తెలుసుకుంటే.. కోట్లాది మందికి కుద‌రనిది.. అతి కొద్ది మందికి మాత్ర‌మే ఎలా సాధ్య‌మైంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కేసీఆర్ చేసిన ప్ర‌సంగంలో ఆయ‌న కొన్ని మాట‌లు మాట్లాడారు. విప‌క్ష స‌భ్యుడి వాద‌న‌ను త‌ప్పు ప‌డుతూ కేసీఆర్ మాట్లాడే క్ర‌మంలో తాను ఈ రోజు పేప‌ర్ల‌ను చూశాన‌ని.. అందులో గిరిజ‌నుల ఆదివాసుల‌ను అడివికి దూరం చేసేలా సుప్రీం తీర్పు ఉందంటూ ఎడిటోరియ‌ల్ పేజీలో ఆర్టిక‌ల్స్ చూశాన‌ని.. సుప్రీంకోర్టు తీర్పు ఫైన‌ల్ అని.. అదిచ్చిన త‌ర్వాత కూడా అలా రాసుడేంద‌న్న మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చింది.

ముఖ్య‌మంత్రిగా ఉన్న వేళ‌.. ఊపిరి స‌ల‌ప‌ని ప‌నుల్లో బిజీగా ఉంటూనే.. ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న అంశాలు.. ఆర్టిక‌ల్స్ ను దీక్ష‌గా చ‌దివే తీరును చూస్తే.. కేసీఆర్ విజ‌యానికి కార‌ణం ఏమిటో ఇట్టే అర్థం కాక మాన‌దు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌తో పాటు.. పాల‌కులు.. కొన్ని వ్య‌వ‌స్థ‌లు చేసే త‌ప్పుల్ని ఎత్తి చూప‌టంతో మీడియా ఇప్ప‌టికి క్రియాశీల‌కంగానే ప‌ని చేస్తోంది. కొన్ని అంశాల విష‌యంలో కొంత‌మేర మీడియా సంస్థ‌లు రాజీ ప‌డిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికి బాధిత వ‌ర్గాల‌కు గొంత‌క‌లా వ్య‌వ‌హ‌రించ‌టంలో మీడియా త‌న పాత్ర‌ను తాను పోషిస్తోంది. ఈ విష‌యాన్ని గుర్తించ‌టం.. ఏయే అంశాల మీద ఎవ‌రెవ‌రు ఎలా స్పందిస్తున్నారు? ఎవ‌రి వాద‌న ఏమిటి? అన్న విష‌యాల్ని కేసీఆర్ నిశితంగా ప‌రిశీలిస్తున్నారు కాబ‌ట్టే.. ఆయ‌న ప్ర‌తి అంశం మీదా అప్డేట్ గా ఉండ‌టంతో పాటు.. నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌క‌పోవ‌టానికి కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.