Begin typing your search above and press return to search.

హోమ్ ఐసోలేషన్‌లో కేసీఆర్ ..ఆయన్ని ఏమీ చేయలేదన్న మోహన్‌బాబు !

By:  Tupaki Desk   |   21 April 2021 7:30 AM GMT
హోమ్ ఐసోలేషన్‌లో కేసీఆర్ ..ఆయన్ని ఏమీ చేయలేదన్న మోహన్‌బాబు !
X
తెలంగాణలో మళ్లీ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు సైతం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఫామ్‌ హౌస్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియగానే రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఈ విషయంపై తాజాగా సినీనటుడు మోహన్‌బాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు. పోరాట యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయన్ని కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. మంగళవారం కేటీఆర్‌ తో పాటు ఎమ్మెల్సీ కవిత ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, భయపడాల్సిందేమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ...తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి పోతుండటంతో వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు (మే 1న ఉదయం 5 గంటల వరకు) అమల్లో ఉంటుందని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.