Begin typing your search above and press return to search.

ఈసారి సెట్టింగ్ ప్రగతిభవన్ లో పెట్టేసిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:47 AM GMT
ఈసారి సెట్టింగ్ ప్రగతిభవన్ లో పెట్టేసిన కేసీఆర్!
X
ఆసక్తికర నిర్ణయాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మాటలు మిఠాయిల మాదిరి ఉండటం తెలిసిందే. ఆయన చేతలు కూడా విలక్షణంగా ఉంటాయి. ఆయన డిసైడ్ కావాలే కానీ.. ఏమైనా చేసేయటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడు ఎవరిని సీన్లోకి దించుతారో తెలియని ఆయన.. తన దగ్గర సిద్ధంగా ఉన్న అస్త్రాల్ని సమయం.. సందర్భం చూసుకొని సంధిస్తుంటారు. ఈ మధ్యన వాసాల మర్రికి వెళ్లిన సందర్భంగా సీఎం కేసీఆర్ పక్కనే ఒక పెద్ద మనిషి ఉండటాన్ని చాలామంది గమనించలేదు.

దీంతో.. సీఎం కేసీఆర్ స్వయంగా కలుగజేసుకొని.. ఏమ్మా... ఈ పెద్ద మనిషిని గుర్తు పెట్టారా? అని అడగటం.. ముఖానికి మాస్కు ఉండిపోవటంతో ఆయన్ను యాది చేసుకోని పరిస్థితి. చివరకు ఆయనే కల్పించుకొని.. ‘గోరేటి వెంకన్న అమ్మా.. బండి ఎనక బండి కట్టి అంటూ తెలంగాణ కదిలేలా పాట రాసింది ఆయనే’ అంటూ భారీ ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. సాధారణంగా ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రి.. ఒక కవిని.. ప్రజా గాయకుడ్ని తన వెంట తీసుకెళ్లటం.. అక్కడి వారికి పరిచయం చేయటం ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే.. గోరేటి వెంకన్నను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వెంట తీసుకెళ్లింది లేదు. అలాంటిది వాసాలమర్రికి తీసుకెళ్లారంటే ఏదో ఒక లెక్క ఉంటుంది? అదేమిటన్నది చాలామందికి అర్థం కాలేదు. ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. ఆ మధ్యన ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే.. ఎవరి అంచనాలకు అందని రీతిలో గోరేటి వెంకన్నను సభకు ఎంపిక చేయటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో పాటలు రాసుకుంటూ.. వాటిని పాడుకుంటూ.. ప్రజల్లో చైతన్యానికి ప్రయత్నించే గోరేటి వెంకన్నను ఏకంగా ఎమ్మెల్సీని చేసేసిన కేసీఆర్ నిర్ణయం పలువురిని విస్మయానికి గురి చేసింది.

ఎమ్మెల్సీ హోదాలో తనతో పాటు గోరేటి వెంకన్నను వాసాలమర్రికి కేసీఆర్ ఎందుకు తీసుకెళ్లారన్న విషయంపై తాజాగా స్పష్టత వచ్చిందంటున్నారు. తరచూ ఫాంహౌస్ కు వెళ్లే ఆయన.. తన రాజకీయ వ్యూహాల్ని పదును పెట్టేందుకు.. ఎవరెవరిని కలవాలి? వారితో ఏమేం చర్చించాలన్న దాని కోసం.. కూసింత రిలాక్స్ అయ్యేందుకు.. తనకెంతో ఇష్టమైన మేథోపర చర్చలకు ఫాంహౌస్ ను వాడేస్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఫాంహౌస్ లో సెట్టింగ్ ఉంటుందని చెబుతారు.

తాజాగా మాత్రం తన తీరుకు భిన్నంగా ప్రగతిభవన్ లోనే ఈ తరహా సెట్టింగ్ ఒకటి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. కేసీఆర్ తాజా మానస పుత్రిక అయిన తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్నిప్రజల్లోకి తీసుకెళ్లటానికి.. తిరుగులేని ఆయుధంగా మార్చుకోవటానికి వీలుగా కొన్ని పాటల్ని సిద్ధం చేయించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం గోరేటి వెంకన్న.. సాంస్కృతిక సారథి ఛైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. రచయిత దేశపతి శ్రీనివాస్.. రచయిత కమ్ కళాకారులుగా పేరున్న కోదాడి శ్రీను.. అంబటి వెంకన్న.. మిట్టపల్లి సరేందర్.. అభినయ శ్రీనివాస్.. బోడ చంద్రప్రకాశ్.. మానుకోట ప్రసాద్.. ఏకే భిక్షపతి.. బాబు.. శివ లాంటి వారితో మేథోపరమైన చర్చలు జరిపి.. దళితబంధు కాన్సెప్టు గుండెల్ని టచ్ చేసేలా కొన్ని పాటల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

సదరు పాటల్ని సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా.. మనసుల్ని హత్తుకునేలా చరణాలు ఉండాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం.. గోరేటి వెంకన్న అండ్ కోనువాసాల మర్రికి తీసుకెళ్లి..తన దళిత బంధు కార్యక్రమానికి స్పందన ఏ రీతిలో ఉందన్న విషయాన్ని తెలియజేశారని చెబుతున్నారు. స్ఫూర్తిని రగిలించేందుకు.. అదిరే పాటల్ని సిద్ధం చేయించాలన్న ఉద్దేశంతోనే ఈసారి ప్రగతి భవన్ లోనే సెట్టింగ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ పాటలు ఆగస్టు 16న విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. ఇలాంటివి సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో?