Begin typing your search above and press return to search.

జగన్ని వదలని కేసీయార్... ?

By:  Tupaki Desk   |   13 Feb 2022 3:13 PM GMT
జగన్ని వదలని కేసీయార్... ?
X
కేసీయార్ ఇపుడు చండప్రచండంగా చెలరేగుతున్నారు. ఆయనలో ఒకనాటి ఉద్యమ సూర్యుడు కనిపిస్తున్నాడు. కేసీయార్ కేంద్ర బడ్జెట్ మీద చేసిన కామెంట్స్ తో పొలిటికల్ కాక ఒక్కసారిగా రేగింది. అది చల్లారకుండా ఆయన ప్రతీ రోజూ గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. వరసగా జిల్లా టూర్లు పెట్టుకుంటూ సాగుతున్న కేసీయార్ మోడీ మాస్టారూ ఇక చాలు దిగిపోండి అంటున్నారు.

తెలంగాణా నా ప్రాణం. అలాంటి తెలంగాణాలో నా మానాన నేను పాలిస్తూంటే అనవసరంగా కెలికారు అంటూ మోడీ సర్కార్ మీద రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో మోడీ తో పాటు ఏపీ సర్కార్ మీద కామెంట్స్ చేశారు.

విద్యుత్ సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకువచ్చిన తీసుకువచ్చినవి రైతులకు ఇబ్బంది పెట్టేవనే తాము అమలు చేయడంలేదని అన్నారు. ఇక కేంద్రం పార్లమెంట్ లో ఈ సంస్కరణల బిల్లు ఆమోదం పొందకముందే అమలు చేస్తోందని గుస్సా అయ్యారు. తాము రైతుల మేలు కోరే పాలకులమని, ససేమిరా వాటిని అమలు చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు.

పొరుగున ఉన్న ఏపీ సర్కార్ మాత్రం విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తోందని జగన్ ప్రస్థావన కూడా కేసీయార్ తీసుకువచ్చారు. ఏపీలో కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 25 వేల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టారని ఆయన అన్నారు. కేంద్రం చెప్పకుండానే జగన్ ఈ పని చేస్తున్నారా అని కూడా అడిగారు.

మొత్తానికి మోడీ వర్సెస్ కేసీయార్ అన్నట్లుగా కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధంలో ఇపుడు సడెన్ గా జగన్ని కూడా తీసుకువచ్చారు. రైతులకు పూర్తి వ్యతిరేకమైన ఈ విద్యుత్ సంస్కరణలను తాము అమలు చేయమని చెబుతున్న కేసీయార్ ఏపీలో రైతులను ఆ విధంగా జగన్ సర్కార్ మీద వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.

ఒకనాడు దోస్తీగా ఉండే ఈ ఇద్దరు తెలుగు సీఎంల దారులు ఇపుడు వేరు అయ్యాయి. జగన్ మోడీని పల్లెత్తు మాట అనకపోవడమే కాదు, కేసీయార్ తో కూడా భేటీలు వేయడం మానుకున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ కేంద్రానికి తలొగ్గి రైతులకు అన్యాయం చేస్తోంది అని కేసీయార్ చేస్తున్న కామెంట్స్ నిజంగా సంచలనంగానే చూడాలి అంటున్నారు. మరి దీని మీద జగన్ కానీ ఆయన మంత్రులు కానీ ఏమంటారో. లేక షరా మామూలుగా సైలెంట్ అవుతారో. చూడాలి.