Begin typing your search above and press return to search.

జానా మాటల్ని జాగ్రత్తగా వినమన్నారట

By:  Tupaki Desk   |   18 March 2016 6:36 AM GMT
జానా మాటల్ని జాగ్రత్తగా వినమన్నారట
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అతి ముఖ్యమైన సీనియర్లలో.. తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఒకరు. ఇక.. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న అధికార.. విపక్షాలకు చెందిన సీనియర్ నేతల్లో జానారెడ్డిదే మొదటి పేరుగా చెప్పక తప్పదు. సీనియర్ నేతగానే కాదు.. సంప్రదాయాల్ని పాటించే నాటి తరం రాజకీయ నేతగా జానారెడ్డి వ్యవహరిస్తుంటారు.

ప్రస్తుతం నడుస్తున్న దూకుడు రాజకీయాలకు ఏమాత్రం సూట్ కాని ఆయన.. తనదైన శైలిలో వెళుతూ పలు విమర్శల్ని మూటగట్టుకున్నా.. తన విధానాల్ని వదిలిపెట్టేందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడరు. ఆవేశంగా మాట్లాడటం.. రెచ్చిపోయినట్లుగా చెలరేగిపోవటం లాంటి వాటిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆవేశంతోనే రాజకీయాలు చేయాలన్న మాటను కొట్టిపారేసే ఆయన.. తన వాదనను నిండు అసెంబ్లీలో తొణక్కుండా బెణక్కుండా వినిపిస్తారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో ఎవరికి దక్కని మర్యాద జానారెడ్డికి దక్కింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సమయంలో.. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం పరిమితులకు లోబడి ఉంటుంది. అయితే.. అందుకు భిన్నంగా జానారెడ్డికి మాత్రం అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడినా అనుమతించాలని.. ఆయన ప్రసంగానికి కాలపరిమితి పెట్టొద్దంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్లు మంత్రి ఈటెల రాజేందర్.. అసెంబ్లీలో చెప్పటం గమనార్హం.

అంతేకాదు.. తాను యాదాద్రి వెళ్లటం వల్ల అసెంబ్లీలో ఉండటం సాధ్యం కావటం లేదని.. జానారెడ్డి చెప్పిన మాటల్ని అధికారపక్ష సభ్యులంతా జాగ్రత్తగా వినాలంటూ ముఖ్యమంత్రి తమతో చెప్పినట్లుగా ఈటెల వెల్లడించగా.. దానికి జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన విషయాల్లో తెలంగాణ రాజకీయం ఎలా ఉన్నా.. అసెంబ్లీ నిర్వహణ విషయంలో కాస్తంత హుందాగా సాగుతున్నాయన్న మాట వినిపిస్తోంది.