Begin typing your search above and press return to search.

నార్త్ ఇండియన్ లీడర్స్ సౌత్ ఇండియన్ లీడర్స్ ని ఎదగనీయరా...?

By:  Tupaki Desk   |   2 Sep 2022 9:48 AM GMT
నార్త్ ఇండియన్ లీడర్స్ సౌత్ ఇండియన్ లీడర్స్ ని ఎదగనీయరా...?
X
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక పీవీ నరసింహారావు, ఒక దేవేగౌడ తప్పించి ఈ దేశానికి ప్రధానులు అయిన వారు ఎవరూ దక్షిణాది నుంచి ఎవరూ లేరు అనే చెప్పాలి. అది రాజకీయంగా లభించిన అతి తక్కువ గుర్తింపుగానే చూడాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిన వేళ దేశం దాదాపుగా పదిహేను మందికి మించి ప్రధానులను చూసిన టైమ్ లో కేవలం ఇద్దరు అంటే ఇద్దరు సౌత్ నుంచి ప్రధానులుగా ఉన్నారంటే దానికి కారణాలు ఏమిటి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఈ దేశానికి ఆదాయం ఎలా లభిస్తోంది. ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రాల నుంచి ఆదాయ వనరులు వచ్చి కేంద్ర ఖజానాకు చేరుతున్నాయన్న గణాంకాలు వెలికి తీసి చర్చకు పెడితే సౌత్ నుంచే ఎక్కువగా ఆదాయం ఈ దేశానికి వస్తోంది అని చెప్పుకోవాలి. దేశ స్థూల జాతీయ ఆదాయం చూసుకున్నా లేక జీఎస్టీ అనబడే వస్తు సేవా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తీసుకున్నా కూడా అది సౌత్ స్టేట్స్ నుంచే ఎక్కువగా లభిస్తోంది అని చెప్పాల్సిన అవసరం ఉంది.

సరే ఇంతలా ఆదాయం సమకూర్చి ఈ దేశానికి ప్రధాన ఇంధనంగా సౌత్ స్టేట్స్ ఉన్నా కూడా ఈ దేశంలో వారికి రాజకీయంగా సరైన గుర్తింపు ఉందా అంటే లేదు అనే మాట అంతటా వినిపిస్తోంది. ఇపుడు దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది కూడా. ఇక ఈ దేశంలో నార్త్ వారు అయితే చాలు అందలాలు సులువుగా దక్కుతాయి అన్న మాట కూడా ఉంది. ముఖ్యంగా ఈ దేశానికి ప్రధానులు అందించిన స్టేట్ గా యూపీని ఎపుడూ చెబుతారు. దానికి కారణం అక్కడ ఎక్కువ మంది లోక్ సభ సభ్యులు ఉన్నారని అంటారు.

అది సరే అనుకున్నా చాలా సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అయి సౌత్ స్టేట్స్ బలం మీద అధారప‌డిన సందర్భాలలో కూడా సౌత్ నుంచి రాజకీయ నాయకులకు ఏమి విలువ ఇచ్చారు అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. కింద పడ్డా తమదే పై చేయి అన్నట్లుగా నార్త్ లీడర్స్ అంతటా తమ ఆధిపత్యం చూపిస్తారు అన్న మాట అనుమనాలను దాటుకుని మరీ విమర్శల స్థాయికి ఇపుడు చేరుకుంది అని కూడా అంటున్నారు. ఒక విధంగా ఈ దేశంలో ఎక్కువ మంది ఎంపీలు నార్త్ నుంచి ఉండవచ్చు అంత మాత్రం చేత ఈ దేశ భౌగోళిక రూపాన్ని ఎవరూ మార్చలేదు.

కానీ కేవలం దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని రాజకీయ గుర్తింపు ఇచ్చే విషయంలో వివక్ష చూపుతున్నారా అంటే చాలా కాలంగా నలుగుతున్న ఈ చర్చలో అవును అనే జవాబు కూడా వస్తోంది అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇక నార్త్ సౌత్ వివక్ష విషయంలో ఎన్నో సార్లు చర్చోపచర్చలు జరిగాయి. తాజాగా జరిగిన ఒక ఉదాహరణను కూడా జనాలు ఇపుడు చర్చకు తెస్తున్నారు.

అదేంటి అంటే ఈ మధ్యనే తెలంగాణా సీఎం కేసీయార్ బీహార్ రాష్ట్రానికి వెళ్లారు. ఆయన అక్కడ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నపుడు పక్కన కూర్చున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ పదే పదే లేచి నిలబడడం, వెళ్ళిపోవడానికి చూడడాన్ని కూడా కొందరు వేరేగా అర్ధాలు తీసి మాట్లాడుతున్నారు. నితీష్ కేసీయార్ కి విలువ ఇవ్వలేదని, ఆయన మీడియాను ఫేస్ చేస్తూంటే ఆయనకే క్రెడిట్ మొత్తం వెళ్ళిపోతుందని ఆలోచించి అలా చేశారని బీజేపీ వారు అంటున్నారు.

మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ రాక రాక వచ్చిన అతిథి తమ ఇంట్లో ఉండగా అలా లేచి వెళ్ళిపోవాలని చూడడం మాత్రం మంచిది కాదేమో అన్న చర్చ అయితే ఉంది. నితీష్ ఏమీ అనుభవం లేని వారు కారు, ఆయన రాజకీయాల్లో ఢక్కా మెక్కీలు తిన్న నేత. అలాంటి నితీష్ కేసీయార్ తో పాటే కూర్చుని ఉంటే హుందాగా ఉండేది. మరి ఆయన ఏ కారణం వల్ల అలా లేచి వెళ్ళిపోవడానికి చూసినా కూడా అతిథికి ఎంతో కొంత అవమానమే కదా అన్నది సాదా సీదాగా వచ్చే చర్చగానే అంతా చూస్తున్నారు.

ఇపుడు ఈ వీడియోను బీజేపీ వారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక విధంగా బీజేపీ వారికి కేసీయార్ మీద ఇంత ప్రేమ అభిమానం ఎందుకు కలిగింది. అసలు ఎందుకు కలగాలి అని ఆలోచించుకున్నపుడు కూడా ఇది ఫక్తు రాజకీయం కోసమే వీడియో వైరల్ చేశారు అనుకోవాలి. సరే అలా వారు సౌత్ లీడర్ ని నార్త్ లీడర్ నితీష్ అవమానించారు అని ప్రచారం చేసినా బీజేపీ చేసిదేంటి, ఇప్పటిదాకా చేస్తోందేంటి అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి. ఎంతోమంది సౌత్ లీడర్స్ జాతీయ స్థాయిలో వెలగాలని చూశారు. ఒక ఎన్టీయార్, చంద్రబాబు, ఇపుడు కేసీయార్ వీరిని వాడుకోవడమే తప్ప సరైన ఎలివేషన్ ఎక్కడా ఇచ్చిన దాఖలాలు అయితేలేవు అనే చరిత్ర చెబుతోంది. ఇక తమిళనాడులో ఒక కరుణానిధి, జయలలిత కూడా దిగ్గజ నాయకులుగా ఉన్నా కూడా వారిని కూడా కేవలం ఆయా రాష్ట్రాలకే కట్టడి చేసిన రాజకీయం సాగింది అని కూడా చరిత్ర చెబుతోంది.

ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తీసుకురావలన్నది ఎవరి ఉద్దేశ్యం కాకపోయినా ఈ రోజున ప్రజలు చైతన్యం అవుతున్నారు. అంతా అన్నీ తెలుసుకుంటున్నారు. అందరూ తమ వాటా ఏదీ అని నిగ్గదీసి అడుగుతునన్ రోజులు ఇవి. సౌత్ నుంచి లీడర్ వెళ్ళి ఈ దేశాన్ని ఏలినా తమ బతుకులు బాగుపడిపోతాయని కాదు కానీ అది ఒక సింబాలిక్ గా చెప్పుకోవడానికి ఉంటుంది. తమకూ ఒక గుర్తింపు ఉంటుంది అని భావించడానికి ఉంటుంది.

మరి తిప్పి తిప్పి కొడితే మీరు 129 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ లేరు కాబట్టి ఎప్పటికీ మీరు ఇంతే అని లెక్కల చిట్టా విప్పి ఏమైనా చెప్పాలనుకుంటే కుదిరే రోజులు కూడా కావు ఇవి. ఎంత బంగారం అయినా గోడ చాటు కావాలి. అలా ఈ సీట్లే బంగారమై కేంద్రంలో ప్రభుత్వాలు నిలబెట్టిన చరిత్రా ఉంది. భవిష్యత్తులో కూడా సౌత్ స్టేట్స్ కీలకం అయినా అవుతాయి. అందువల్ల వివక్ష అన్న మాట ఎవరి మనసులో లేకుండా రాకుండా అంతా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.