Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట తరచూ ‘రియల్’ మాటా..?

By:  Tupaki Desk   |   19 Sep 2016 7:48 AM GMT
కేసీఆర్ నోట తరచూ ‘రియల్’ మాటా..?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం కాస్త విచిత్రమైనది. ఆయన తీరును.. ఆయన సర్కారు తీరును సూటిగా ప్రశ్నించేవారు.. విమర్శించే వారు తక్కువగా ఉంటారు. ఇక.. ఆయనపై ఆరోపణలు చేయటానికి జంకే పరిస్థితి. ఇది రాజకీయ నాయకుల్లోనే కాదు.. మీడియాలోనూ ఉందన్న వ్యాఖ్య ఈ మధ్యన తరచూ వినిపిస్తోంది. కాస్త అటూఇటూగా రెండున్నరేళ్ల పాలనకు దగ్గర పడిన కేసీఆర్ సర్కారు తప్పటడుగుల్ని ఎత్తి చూపిస్తూ.. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క కథనం ప్రముఖంగా రాలేదన్న మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనపై విమర్శ కాకుండా.. ఆయన వ్యవహారశైలిలో వచ్చిన మార్పుపై ఒక ఆసక్తికర కోణాన్ని ఒక జాతీయమీడియా సంస్థ ఒకటి ప్రస్తావించింది.

ఇటీవల కాలంలో కేసీఆర్ లో వచ్చిన మార్పు గురించి.. ఆయన మాటల తీరును ప్రస్తావించిన సదరు మీడియా.. అందుకు సాక్ష్యంగా ఒక అంశాన్ని ప్రస్తావించింది. అధికారులతో భేటీ అయిన సందర్భంగా పలు అంశాల గురించి కేసీఆర్ వాకబు చేస్తూ కనిపిస్తారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన ఒక విషయాన్ని తరచూ ప్రశ్నించటమే కాదు.. దానికి సంబంధించిన వివరాల్ని తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా సదరు కథనం చెబుతోంది.

కొత్త జిల్లాల ప్రకటన.. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాల్ని వాయువేగంతో పూర్తి చేస్తున్న వేళ.. తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఎంత మేర పెరిగిందన్న మాటను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. శాఖ ఏదైనా.. అధికారులతో రివ్యూ నిర్వహించే సందర్భంలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రస్తావిస్తూ.. ఆ వెంటనే.. కొత్త జిల్లాల ప్రకటన తర్వాత ఆయా జిల్లాల్లో ఎంతమేర రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగాయన్న వాకబు కేసీఆర్ చేస్తున్నట్లుగా సదరు కథనం వెల్లడించింది.

ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్లే అధికారులు రియల్ ఎస్టేట్ ఎంతమేర పెరిగిందన్న విషయాల్ని వీలైనంత ఎక్కువగా చెబుతున్నారట. కొత్త జిల్లాల ప్రకటన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్పష్టమైన జంప్ వచ్చిందని.. రియల్ ఎస్టేట్ కు ఒక ఊపు.. ఉత్సాహాన్ని అందించినట్లుగా ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళుతున్నారట. వారి మాటలతో కేసీఆర్ విపరీతంగా సంతోషానికి గురి అవుతున్నట్లుగా ఆయన వైఖరి ఉందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ మాట ఎలా ఉన్నా.. కొత్త జిల్లాల్ని భారీ ఎత్తున పెంచుతున్న కారణంగా.. ఆర్థిక భారం ప్రభుత్వం మీద ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందనే కన్నా.. రియల్ ఎస్టేట్ ఎంక్వయిరీ మీద ఇంత వాకబు ఎందుకు కేసీఆర్..?