Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట.. ఆసక్తికర మాట..

By:  Tupaki Desk   |   4 April 2019 9:20 AM GMT
కేసీఆర్ నోట.. ఆసక్తికర మాట..
X
ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే గల్లీలో ఒకలా..? ఢిల్లీలో ఒకలా మాట్లాడుతుంటారు.. అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన కేసీఆర్ కు.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడుతున్న కేసీఆర్ కు చాలా తేడా ఉందని అంటున్నారు.

కేసీఆర్ రాజకీయాలు అంత తేలిగ్గా అర్థం కావు.. ఎప్పుడు ఎవరిని జోకొడుతారో తెలియదు.. ఎవ్వరిని హెచ్చరిస్తారో తెలియదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్యంగా కేసీఆర్ మాట మార్చాడు. సోనియాగాంధీపై హాట్ కామెంట్ చేశారు..

జాతీయ చానెల్ అయిన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ దేశానికి ప్రాంతీయ పార్టీలే దిశానిర్దేశం చేస్తాయని స్పష్టం చేశారు. తనకు ప్రధాని కావాలన్న కోరికల లేదని.. ఎవరో ప్రధాని కావాలని పనిచేయడం లేదని.. ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని పాలించేలా చేయడమే తమ కర్తవ్యమన్నారు.

ఇక కాంగ్రెస్ అంటేనే ఒంటికాలిపై లేచే కేసీఆర్ తాజాగా మాట మార్చడం రాజకీయంగా సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ కంటే సోనియాగాంధీ చాలా పరిపక్వతతో ఆలోచిస్తారని.. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో ఐదేళ్లు పాలించమని సంపూర్ణ అధికారం ఇచ్చిన దేశ ప్రజలు మోడీపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఆయన వమ్ము చేశారని కేసీఆర్ ఆరోపించారు.

ఇలా మోడీని తిడుతూ.. సోనియాను కేసీఆర్ పొగడడం రాజకీయంగా సంచలనమైంది. దేశంలో మోడీపై వ్యతిరేక పవనాలు.. కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీయడం.. ఈసారి బీజేపీకి గడ్డు పరిస్థితులు అన్న విశ్లేషణలు సాగడంతోనే కేసీఆర్ యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. కేసీఆర్ లాంటి అపరచాణక్య రాజకీయ నేత కాంగ్రెస్, సోనియాను హఠాత్తుగా పొగడడం వెనుక బలమైన కారణమే ఉంటుందని విశ్లేషిస్తున్నారు.