Begin typing your search above and press return to search.

కేసీఆర్ తాజా స‌ర్వే సో స్పెష‌ల్ అంట‌

By:  Tupaki Desk   |   17 Feb 2018 7:32 AM GMT
కేసీఆర్ తాజా స‌ర్వే సో స్పెష‌ల్ అంట‌
X
ఎన్నిక‌ల వేడి మొద‌ల‌యిన నేప‌థ్యంలో తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. రెండోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా ఉన్నప్ప‌టికీ విజ‌యం అంత ఈజీ కాద‌ని గులాబీ బాస్ గ్ర‌హించార‌ని అంటున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం స‌ర్వే మంత్రం జ‌పిస్తున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 119 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ - వచ్చే ఎన్నికలకు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఒకటికి నాలుగుసార్లు సర్వేల ద్వారా అభ్యర్థుల జాతకాలు తెలుసుకుంటున్నారు. ఇందులో అభ్యర్థులపై కంటే పార్టీకే ప్రజలు ఎక్కువ మద్దతు తెలుపుతున్నారని టీఆర్‌ ఎస్‌ ఎల్పీ మీటింగ్‌ ల్లో సీఎం కేసీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 40 మందికిపైగా సిట్టింగు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ గుర్తించారు. ఎమ్మెల్యేలకు అందించిన సర్వే రిపోర్టుల్లోనే ఈ విషయం వెల్లడైంది.
దీంతో కొంతమంది సిట్టింగులను మార్చి, ఆ స్థానాల్లో కొత్తవారికి టికెట్లు ఇస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై వార్తలు వచ్చినప్పుడల్లా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. అయినా చాలామంది అభ్యర్థుల్లో అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రజల్లో ఉండి పనిచేసుకోవాలని చెప్పడంతో వారంతా నియోజకవర్గాలకు పరిమితమయ్యారు.

అయినప్ప‌టికీ అటువంటివారిని నమ్మి టికెట్లు ఇస్తే ఆ నియోజకవర్గాల్లో గెలుస్తామన్న ఆశ టీఆర్‌ ఎస్‌ పార్టీ నేతల్లో ఎక్కువమందికి లేదు. దీంతో అక్కడ నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలను చేర్పించి, గులాబీ కండువాలు కప్పిన విషయం తెలిసిందే. తమకు టికెట్లు వస్తాయన్న ఆశతో వారంతా ఉన్నారు. అయితే ఇప్పటికే సిట్టింగు ఎమ్మెల్యేలకు తమతమ నియోజకవర్గాలకు మంచి పట్టు ఉంది. ఒక గ్రూపును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా వివిధ పార్టీలకు చెందిన నేతలను - కార్యకర్తలను టీఆర్‌ ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకూ నియోజకవర్గాల్లో పట్టు ఉంది. దీంతో వారిని పక్కనపెట్టి ఆ స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తే - వారంతా ఎదురుతిరగడం ఖాయమని టీఆర్‌ ఎస్‌ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో గులాబీ ద‌ళ‌ప‌తి ప‌రిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా చేరిన వారిని బుజ్జగించి, సిట్టింగులకే టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చా గులాబీ అధినేత చేస్తున్నారని సమాచారం. అదే సందర్భంలో సిట్టింగుల్లో బాగా వ్యతిరేకత ఉంటే - అటువంటి వారిని మార్చి ఆ నియోజకవర్గాల్లో అంతకంటే బెటర్‌ క్యాండెట్‌ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని కూడా చర్చిస్తున్నారు. దీనిపైనా సర్వే చేయించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. టీఆర్‌ ఎస్‌ పార్టీ పట్ల - ప్రభుత్వ - ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా చేయించిన తుది సర్వే ఫలితాలు సీఎం కేసీఆర్‌ వద్దకు చేరినట్టు టీఆర్‌ ఎస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు వీటిని వెల్ల‌డించ‌నున్న‌ట్లు స‌మాచారం.