Begin typing your search above and press return to search.

పిలుపుల కోసం వ‌చ్చే కేసీఆర్ ప్లానింగ్ వేరే ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   14 Jun 2019 6:50 AM GMT
పిలుపుల కోసం వ‌చ్చే కేసీఆర్ ప్లానింగ్ వేరే ఉంద‌ట‌!
X
ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టును నిర్మించింది. దాని ప్రారంభోత్స‌వాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోవ‌టం మామూలే. స‌ద‌రు ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి విశిష్ఠ అతిధిని ఆహ్వానించాల‌ని భావిస్తే.. రాష్ట్రప‌తినో.. కుద‌ర‌కుంటే ప్ర‌ధాన‌మంత్రినో పిలుస్తారు. ఇలాంటివ‌న్నీ రోటీన్ గా సాగేవే.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రో అడుగు ముందుకేసి.. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ప్రారంభోత్స‌వానికి పిలుస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. కాసేపు కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌లో ఎలాంటి క‌ల్మ‌షం లేద‌ని.. ఆయ‌న చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజ‌మ‌నే అనుకుందాం. ఇరుగుపొరుగు అన్న‌ప్పుడు తెలంగాణ‌కు మ‌హారాష్ట్ర.. ఏపీలు మాత్ర‌మే ఇరుగుపొరుగా? క‌ర్ణాట‌క ఉందిగా? ఆ రాష్ట్రానికి పిలుపులు ఎందుకు లేవు? అన్న‌ది సందేహంగా మారింది.

ఈ డౌట్ కు జ‌వాబు వెతికే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు తెలుస్తున్నాయి. త‌మ రాష్ట్రం నిర్మించే ప్రాజెక్టు ప్రారంభానికి మ‌హారాష్ట్ర.. ఏపీ ముఖ్యమంత్రుల‌ను తానే స్వ‌యంగా వారి వారి రాష్ట్రాల‌కు వెళ్లి మ‌రీ ఆహ్వానించ‌టం వెనుక.. కేసీఆర్ మాస్ట‌ర్ మైండ్ ఉందంటున్నారు. ప్లాన్ బిలో భాగంగానే ప్లాన్ ఏను అమ‌లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

పైకి చూసేందుకు కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి పిలుస్తున్న‌ట్లుగా పిలిచిన‌ప్ప‌టికీ.. అంత‌ర్లీనంగా త‌న‌కు ఏపీ ముఖ్య‌మంత్రి అండ ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేయ‌టం కార‌ణమ‌ని చెబుతున్నారు. దాన్ని క‌వ‌ర్ చేసుకునేందుకు వీలుగా మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఆహ్వానిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌కు స‌రిహ‌ద్దు రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌కలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేరుగా ఉండ‌టం.. యాంటీ మోడీ కావ‌టంతో.. వారికి పిలుపు లేకుండా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

కేవ‌లం త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం త‌ప్పించి.. ఏపీ.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌ను పిలుపు వెనుక మ‌రే ఇత‌ర కార‌ణం లేద‌న్న మాట వినిపిస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో తాను చేసిన వ్యాఖ్య‌లు.. వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో తాను చెప్పిన మాట‌లతో మోడీ షాలు గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతారు. ఈ ఆగ్ర‌హాన్ని కాస్త చ‌ల్లార్చేందుకు వీలుగా మోడీని ముఖ్య అతిధిగా పిలిచిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌నిలో ప‌నిగా.. తాను ఏపీ సీఎంకు స‌న్నిహితుడ‌న్న విష‌యాన్ని మోడీకి అర్థ‌మ‌య్యేలా చేయ‌టం కోసం జ‌గ‌న్ కు ఆహ్వనించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కేసీఆర్ మామూలోడు కాదుగా. ఆయ‌న ప్లానింగ్ ఎంత లోతుగా ఉంటుంద‌న్న‌ది తాజా ఉదంతం స్ప‌ష్టం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. కేసీఆర్ ప్లానింగ్ కు జ‌గ‌న్ ఎలాంటి బ‌దులు ఇస్తారో చూడాలి.