Begin typing your search above and press return to search.

కేసీఆర్ యాగానికి జగన్ రానున్నారా..

By:  Tupaki Desk   |   13 Jan 2019 1:30 AM GMT
కేసీఆర్ యాగానికి జగన్ రానున్నారా..
X
కల్వకుంట్ల చంద్రశేఖర రావు.... తెలంగాణ ముఖ్యమంత్రి. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ‌్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అంతే కాదు కేసీఆర్‌ కు - జగన్ మోహన్ రెడ్డికీ కామన్ శత్రువు. ఆ కామన్ శత్రువును ఈ ఇద్దరు నాయకులు దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. అందుకోసం వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పని చేయాలనుకుంటున్నారు. ఇది దాచేస్తే దాగని సత్యం అని వారికీ తెలుసు - తెలుగుదేశం నాయకులకు తెలుసు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిపిన తర్వాత కేసీఆర్ సాధించిన విజయానికి మురిసిపోయిన జగన్ మోహన్ రెడ్డి తానే స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ మనసారా అభినందించారు.

ఈ విషయాన్ని ఈ మధ్య తన మీడియాతో పాటు మరో ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా పంచుకున్నారు. " అవును. ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందించాను. చాలా గర్వంగా ఉందని కూడా అన్నాను" అని జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేని వారు విజయం సాధిస్తే ఇక్కడి ప్రతిపక్ష నాయకుడు అభినందించడం ఏమిటీ అంటూ చంద్రబాబు నాయుడు - ఆయన పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కారు. అయినా జగన్ మాత్రం వాటికి వెరవలేదు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి మరో కీలక అడుగు కూడా వేయనున్నారని అంటున్నారు. తనపై విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు తనకు ఫోన్ చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావును స్వయంగా కలవాలలనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన వ్యవసాయ క్షేత్రంలో త్వరలో ఓ యాగం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ యాగానికి రావాల్సిందిగా జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించే అవకాశాలున్నాయని సమాచారం. రెండు రోజుల క్రితం తిరుమలలో స్వామి స్వరూపానంద సరస్వతిని జగన్ కలుసుకున్నారు. వీరిద్దరు 45 నిమిషాల సేపు మాట్లాడుకున్నారు. ఇంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విశాఖపట్నంలో స్వామి ఆశ్రమానికి వెళ్లి ఆశీసులు తీసుకున్నారు. కేసీఆర్ తలపెట్టిన యాగం స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలోనే జరుగనున్నది. దీంతో ఈ యాగానికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ చేసిన యాగానికి హాజరయ్యారు. ఆ కోణంలో కూడా ఇప్పుడు జగన్ యాగానికి వెళ్తే తప్పేమిటని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.