Begin typing your search above and press return to search.

శత్రువులతో మైత్రికి కేసీఆర్ ఆరాటం

By:  Tupaki Desk   |   18 Dec 2015 11:14 AM GMT
శత్రువులతో మైత్రికి కేసీఆర్ ఆరాటం
X
రాజకీయాల్లో స్నేహాలు - శత్రుత్వాలూ రెండూ సాధారణమే. రాజకీయాల్లో శాశ్వత మైత్రి - శాశ్వత శత్రుత్వం ఉండవంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని నిజం చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. శత్రువులనూ మిత్రులుగా చేసుకోవడానికి ఆయన ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తనతో పెట్టుకున్న వారిని తొక్కిపడేయగల కేసీఆర్ ఇప్పుడు తనతో వివాదాలు పెంచుకున్నవారందరికీ ఇప్పుడు స్నేహహస్తం అందిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో మైత్రీబంధం దృఢం చేసుకున్న ఆయన తాజాగా మరో విరోధి, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకూ స్నేహహస్తం చాపుతున్నారు. నిజానికి రాధాకృష్ణ - కేసీఆర్ లు ఒకప్పడు మంచి మిత్రులే అయినప్పటికీ కొద్దికాలంగా ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నది ఒక్క రాధాకృష్ణ మాత్రమే.. రాధాకృష్ణకు చెందిన ఏబీఎన్ ఛానల్ ను సుదీర్ఘకాలంలో తెలంగాణలో ప్రసారం కాకుండా చేశారు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఇప్పుడు మళ్లీ రాధాకృష్ణతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. తాను నిర్వహిస్తున్న చండీయాగానికి రావాల్సిందిగా రాధాకృష్ణను కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడంతోపాటు యాగ విశేషాలను వివరిస్తూ ఆయన దాదాపు 20 నిమిషాలు మాట్లాడారని సమాచారం. ఈ తాజా పరిణామం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది.

అయితే... పత్రికల యాజమాన్యాలకు ఆయన ఫోన్ చేసి యాగానికి పిలిచిన సందర్భంగా రాధాకృష్ణను కూడా పిలిచి ఉండవచ్చన్న వాదనా వినిపిస్తోంది. అదేసమయంలో కేసీఆర్ తనకు శత్రువులను తగ్గించుకుని అందరితో మంచిగా సాగుతూ కుమారుడు కేటీఆర్ కు భవిష్యత్తులో ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నట్లుగానూ వినిపిస్తోంది. ఏది నిజమో కాలమో చెప్పాలి... ఈ మైత్రి యాగంతో ఆగిపోతుందో... యాగంతోనే మొదలవుతుందో చూడాలి.