Begin typing your search above and press return to search.

ఇప్ప‌టి మెట్రోరైలు.. కేసీఆర్ పుణ్య‌మా?

By:  Tupaki Desk   |   28 Nov 2017 7:13 AM GMT
ఇప్ప‌టి మెట్రోరైలు.. కేసీఆర్ పుణ్య‌మా?
X
హైద‌రాబాద్ లోని కోటికిపైగా ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు మెట్రో రైలు. న‌గ‌ర‌ట్రాఫిక్ న‌ర‌కాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించి వేస్తుంద‌న్న భావ‌న‌తో చాలామందిలో ఉంది. అందులో నిజం కొంతే అయిన‌ప్ప‌టికీ ఇప్పుడున్న దారుణ ప‌రిస్థితులైతే మెట్రో వ‌చ్చిన త‌ర్వాత ఉండ‌వ‌న్న‌ది నిజం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. హైద‌రాబాద్ మెట్రోకు సంబంధించి గ‌ర్వంగా చెప్పుకోద‌గ్గ ఒక అంశం ఉంది. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో 30 కిలోమీట‌ర్ల మేర ఒకేసారి మెట్రో రైల్‌ను ప్రారంభించింది లేదు. చాలా చోట్ల 10 కిలోమీట‌ర్లు.. లేదంటే ప‌దిహేను కిలోమీట‌ర్లు.. చాలా త‌క్కువ చోట్ల 20 కిలోమీట‌ర్లతో ప్రారంభించేస‌రికి అప‌సోపాలు ప‌డే ప‌రిస్థితి. ఇందుకు భిన్నంగా 30 కిలోమీట‌ర్ల ప‌రిధిలో రెండు కారిడార్‌ ల‌ను ఏక‌కాలంలో పూర్తి చేయించిన ఘ‌న‌త హైద‌రాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ సంస్థ‌కు చెందుతుందంటారు.

అయితే.. అందులో నిజం పాక్షికం మాత్ర‌మే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం మెట్రో రైలు ప్రారంభం అయి ఉంటే.. ఇంత భారీ ఎత్తున ప్రారంభం అయ్యేది కాదు. ఏ అధినేత కార‌ణంగా మెట్రో రైలు లేటు అయ్యింద‌న్న అప‌వాదు ఉందో.. అదే అధినేత కార‌ణంగా అరుదైన‌ రికార్డు సొంత‌మైంద‌ని చెప్పాలి. మొద‌ట్లో అనుకున్న దాని ప్ర‌కారం నాగోలు - అమీర్ పేట‌ .... అమీర్ పేట - మియాపూర్ వేర్వేరుగా అనుకున్నారు. కానీ.. టీఆర్ ఎస్ స‌ర్కారు ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌భుత్వానికి.. మెట్రో రైల్ ప్రాజెక్టుకు మ‌ధ్య‌న మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి.

వాటి పంచాయితీలు ఒక కొలిక్కి తీసుకొచ్చేస‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోయింద‌ని చెప్పాలి. ఈ కార‌ణంగానే హైద‌రాబాద్ మెట్రో రైలు సుమారు రెండేళ్ల‌కు పైగా ఆల‌స్య‌మైంది.

చెడులోనూ మంచి అంటారే.. అలాంటిదే హైద‌రాబాద్ మెట్రో విష‌యంలోనూ చోటు చేసుకుంది. మొద‌ట అనుకున్న ప్ర‌కారం త‌క్కువ దూరానికే మెట్రో రైల్‌ ను ప్రారంభించాల‌ని అనుకున్నారు. కానీ.. ఆల‌స్యం జ‌రిగింది. దీంతో ప్యాచ‌ప్ కోసం కేసీఆర్ స‌ర్కారు ప్ర‌య‌త్నించింది. ఆల‌స్య‌మైంది ఎటు అయ్యింది. జ‌రిగిన అల‌స్యాన్ని మ‌ర్చిపోయేలా ఏం చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌కు ప్ర‌తిరూప‌మే..

బేగంపేట నుంచి అమీర్ పేట ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్‌. మామూలుగా అయితే ప‌నులు జ‌ర‌గ‌టం క‌ష్టం. ఏం చేస్తారో తెలీదు.. కానీ.. పెట్టిన గ‌డువు లోపు ప‌ని పూర్తి చేయాలంటూ కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన ఆదేశం ఎల్ అండ్ టీ.. మెట్రో రైల్ ఒళ్లు విరుచుకొని ప‌నులు మొద‌లు పెట్టాయి. అనుకున్న గ‌డువు లోపు ప‌నులు పూర్తి కావాల‌న్న ఉద్దేశంతో రాత్రి.. ప‌గ‌లు అన్న తేడా లేకుండా చేసిన ప‌నికి నిద‌ర్శ‌న‌మే 30 కిలోమీట‌ర్ల మెట్రో మార్గం పూర్తి కావ‌టంగా చెప్పొచ్చు. కేసీఆర్ కానీ.. బేగంపేట‌.. అమీర్ పేట స్టేష‌న్లు పూర్తి చేసి.. ఇప్పుడున్న మార్గాన్ని టార్గెట్ గా ఇవ్వ‌క‌పోయి ఉంటే.. మొద‌టి ద‌శ ఇప్పుడున్న ర‌కంగా ఉండేది కాద‌న్న‌ది నిజం. ఈర‌కంగా చూసిన‌ప్పుడు ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చిన మెట్రో రైలు మార్గం కేసీఆర్ చొర‌వ‌.. ఆలోచ‌నే కార‌ణంగా చెప్పాలి.