Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు చిరాకు పుట్టించిన మంత్రి

By:  Tupaki Desk   |   1 Oct 2015 4:13 AM GMT
కేసీఆర్ కు చిరాకు పుట్టించిన మంత్రి
X
దూకుడు మంచిదే కానీ.. సమయం సందర్భం లేకుండా వ్యవహరిస్తే చిరాకు పుట్టిస్తుంది. టైం చూసుకొని తమ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు చూపించాలే కానీ.. స్వపక్షం నేతలపై.. తోటి మంత్రిని ఉద్దేశించి కామెడీగా మాట్లాడే మాటలు హుందాగా ఉండవు.

చుట్టూ ఉన్న కెమేరా కళ్లను.. జనాల్ని వదిలేసి తన పాటికి తాను మాట్లాడటమే తప్పించి.. సమయం.. సందర్భం లేకుండా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిరాకు పడ్డారు.

తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన జగదీశ్ అత్యుత్సాహానికి కేసీఆర్ బ్రేకులు వేసినట్లుగా చెప్పొచ్చు. విపక్షాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడే జగదీశ్.. గత రెండు రోజులుగా వివిధ వేదికలపై చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు అవకాశం ఇచ్చాయి. విపక్షాల వైపు విరుచుకుపడుతున్న ఆయన.. అదే ఉత్సాహంలో స్వపక్షం నేతలపై సరదాగా నోరు పారేసుకోవటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరాకు పుట్టించింది.

వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చదవటం మొదలు పెట్టారు. స్పీకర్ మధుసూదనాచారి ఆయన్ను కూర్చోమని చెప్పినా వ్యవసాయ మంత్రి మాత్రం తన ప్రకటన చదువుకుంటూ వెళుతున్నారు.

నిజానికి స్పీకర్ మాటల్ని మంత్రి పోచారం వినకపోవటంతో ఇలా జరిగింది. అదే సమయంలో స్పీకర్ మాటల్ని పోచారానికి అర్థమవ్వాలన్న ఉద్దేశంతో కాబోలు.. మంత్రి జగదీశ్ కాస్త గట్టిగా.. ఓ అన్నా కూకో అన్నా అంటూ గట్టిగా వ్యాఖ్యనించటం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నీకేం పని.. నీ పని నీవు చూసుకో’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.