Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌పైనా కేసీఆర్ గురి.. ఏం చేస్తున్నారంటే!

By:  Tupaki Desk   |   17 Sep 2022 11:30 PM GMT
గుజ‌రాత్‌పైనా కేసీఆర్ గురి.. ఏం చేస్తున్నారంటే!
X
ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికలు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగానే కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు.

కేంద్రంలోకి బీజేపీ రహిత ప్రభుత్వం రావాలనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌పైనా దృష్టి పెట్టారు. అయితే.. అక్క‌డ కేసీఆర్‌కు ప్ర‌త్య‌క్షంగా స‌హ‌క‌రించే పార్టీలు, నాయ‌కులు లేక‌పోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు..ఆయ‌న అనేక రాష్ట్రాల్లో ప‌ర్య‌టించినా.. గుజ‌రాత్‌లో మాత్రం అడుగు పెట్టలేదు.

అయితే.. ఇటీవ‌ల‌ గుజ‌రాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘెలా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తెలంగాణ ప్రగతి, దేశ పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ పోకడలు, రాజకీయ క్రీడ, ప్రజలపై దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలువురితో సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారు.

ఈ పరిస్థితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్‌ వాఘెలాతో సమావేశం ప్రాధాన్యత సంతరించు కొంది. ఇక‌, వాఘేలా కూడా సీఎం కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మోడీ విచ్ఛిన్నకర పాలనపై దేశమంతా ఆందోళన ఉందన‌డం ద్వారా.. కేసీఆర్ వ్యూహానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప‌రోక్షంగా ఆయ‌న చెప్పుకొచ్చిన‌ట్టు అయింది. ప్రజాస్వామిక వాదులు, ప్రగతి కాముకులు మౌనం వహించటం సరికాదని అభిప్రాయపడ్డారు.

అయితే.. గుజ‌రాత్‌లో ప్ర‌స్తుతం శంక‌ర్ సింఘ్ వాఘేలా.. హ‌వా పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. కొన్ని జిల్లాల్లో ఆయ‌న ప్ర‌భావం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక రాష్ట్రాల నుంచి కేసీఆర్‌కు మ‌ద్ద‌తు వ‌చ్చినా.. గుజ‌రాత్ నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కుఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌ని నేప‌థ్యంలో వాఘేలా మ‌ద్ద‌తుతో ఆయ‌న తొలిసారి.. గుజ‌రాత్ గ‌డ్డ‌పై.. ముఖ్యంగా మోడీ పుట్టిన గ‌డ్డ‌పై అడుగు పెట్టే అవకాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.