Begin typing your search above and press return to search.

ధాన్యం గొడవ తీరకముందే కేంద్రంపై కేసీఆర్ మరో పోరాటం

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:31 AM GMT
ధాన్యం గొడవ తీరకముందే కేంద్రంపై కేసీఆర్ మరో పోరాటం
X
ధాన్యం గొడవ తీరకముందే కేంద్రంపై కేసీఆర్ మరో పోరాటం మొదలుపెట్టారు. ఈసారి మోడీకి ‘బొగ్గు’మసి పూసేందుకు కేసీఆర్ రె‘ఢీ’అయ్యారు. మరో అంశంపై కేంద్రంతో పోరాడేందుకు సిద్ధమయ్యారు. కేంద్రప్రభుత్వం సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ప్రధాని నరేంద్రమోడీని కోరారు.

బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాయడం సంచలనమైంది.

ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీరుస్తోందని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 2014లో 5661 మెగావాట్లు ఉండగా.. 2021 మార్చి నాటికి 13688 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరఫరా చేయడం ఎంతో ముఖ్యమన్నారు.

కాగా సింగరేణి బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులు మంజూరు చేసిందని.. అందుకే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాలని కేసీఆర్ కోరారు.