Begin typing your search above and press return to search.

వారిద్దరి భేటీ వెనుక గులాబీ బాస్? 2

By:  Tupaki Desk   |   25 Sep 2015 6:48 AM GMT
వారిద్దరి భేటీ వెనుక గులాబీ బాస్? 2
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మొదటి నుంచి రామోజీ సన్నిహితంగా ఉండటం.. అదే సమయంలో రామోజీ అంటే కేసీఆర్ కు విపరీతమైన గౌరవ మర్యాదలు ఉండటంతో.. కాలం గడిచిపోతోంది. ఈ సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని చెబుతారు. తనకున్న పరిమితులతో కేసీఆర్ తో రామోజీ సన్నిహితంగా ఉండేవారు. మరోవైపు కేసీఆర్.. జగన్ ల మధ్య అనుబంధం బలపడటం.. వీరిద్దరూ ఉమ్మడి శత్రువు చంద్రబాబుగా మారారు.

బాబును దెబ్బ తీయటమే జగన్.. కేసీఆర్ లక్ష్యంగా మారింది. తన కంట్లో నలకలా మారిన బాబును దెబ్బ తీసేందుంకు సరైన అవకాశం చూస్తున్న కేసీఆర్ కు ఓటుకు నోటు వ్యవహారంలో బాబు అడ్డంగా బుక్ అయినట్లుగా కనిపించింది.. అయితే అంతలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు రావటంతో కేసీఆర్ గతుక్కుమనే పరిస్థితి.

దీంతో.. బాబును దెబ్బ తీయటం అంత చిన్న విషయం కాదన్నది కేసీఆర్ కు అర్థమైందని చెబుతారు. ఇదే సమయంలో కేసీఆర్ ను తాను తక్కువగా అంచనా వేస్తున్నానన్న విషయాన్ని బాబు అర్థం చేసుకోవటం.. వెనువెంటనే తట్టా బుట్టా సర్దుకొని ఏపీకి వెళ్లిపోవటం వెను వెంటనే జరిగిపోయాయి. ఇక్కడి వరకూ చాలా విషయాలు చాలామందికి తెలిసే అవకాశం ఉంది.

ఆ తర్వాతే ఏం జరిగిందన్నది పెద్ద ప్రశ్న. మరోవైపు.. మోహన్ బాబు కుమారుడి పెళ్లి సందర్భంగా రామోజీ.. జగన్ ముఖాముఖిన ఎదురుపడటం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం.. మాట్లాడుకోవటం జరిగిపోయాయి. నిజానికి పైకి ఇది కనిపించినా.. తెర వెనుక చాలానే తతంగం జరిగిందని చెబుతారు. రామోజీ కోడలి శైలజా కిరణ్.. జగన్ సతీమణి భారతీల మధ్యవర్తిగా కేసీఆర్ కుమార్తె కీలకభూమిక పోషించారన్న మాట ఒకటి ప్రచారం జరిగింది. కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు కోరుకునే రామోజీ ఫ్యామిలీ.. అదే కుటుంబంలోని వ్యక్తి పుణ్యమా అని జగన్ ఫ్యామిలీతో మాట కలిసిందని చెబుతారు.

ఇక్కడా ఒక లెక్క లేకపోలేదు. ఉత్తి పుణ్యానికి గొడవ పెట్టుకోవటం రామోజీకి ఇష్టం ఉండేది కాదు. ఆయనో తెలివైన.. ముందుచూపున్న వ్యాపారవేత్త. ఎవరితోనూ ఊరికే గొడవ పెట్టుకోవటానికి పెద్ద ఇష్టపడరు. అలాంటి ఆయన.. కోరి మరీ జగన్ ఫ్యామిలీ స్నేహ హస్తం జాపితే ఎందుకు వద్దంటారు. దీనికి తోడు వీరిద్దరి మధ్యన కేసీఆర్ ఉండనే ఉన్నారు.

రామోజీని వ్యక్తిగతంగా విపరీతంగా అభిమానించే కేసీఆర్.. జగన్.. రామోజీ స్నేహం అనివార్యమని.. అదెప్పటికైనా అవసరమన్న విషయాన్ని అటు జగన్ కు.. ఇటు రామోజీకి చెప్పటంలో సఫలమయ్యారని చెబుతారు. ఈ మాటలో నిజం పాళ్లు పక్కన పెడితే.. రాజకీయ వర్గాల్లోనూ.. ఉన్నత వ్యాపార వర్గాల్లోనూ ఇలాంటి వాదన వినిపిస్తుంది. దీనికి తోడు కేసీఆర్ కు.. రామోజీకి అత్యంత సన్నిహితులైన కొందరు బడా పారిశ్రామికవేత్తలు సైతం.. వీరిద్దరి మధ్య స్నేహం మంచిదన్న మాటను పదే పదే చెప్పటం కూడా తాజా పరిస్థితికి కారణంగా చెబుతారు.

రామోజీ.. జగన్ మధ్య మాట కలిసినంతనే ఏదో జరిగిపోతుందని అనుకోవటం భ్రమే అవుతుంది. కాకుంటే.. ఇక్కడ కాలం కీలకభూమిక పోషిస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఏ సాయం కోసం అయితే రామోజీ గడపను జగన్ తొక్కారో.. దాన్ని ఆయన గుర్తుంచుకున్నంత వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సమయంలో ఏపీలో ఏదో ఒకరోజు అధికారం బదిలీ జరగటం ఖాయం. అది జరిగినప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉండే సంబంధాలే.. వారి భవితను తేలుస్తాయని చెప్పాలి. అంతలోపు.. ఇలా కలవటం.. మాట్లాడుకోవటం లాంటివి మామూలన్నట్లుగా జరగటం ఖాయం.

ఇక.. రామోజీ.. జగన్ ల మధ్య స్నేహానికి కేసీఆర్ ఎందుకంత తపిస్తారన్నది మరో ప్రశ్న. నిజానికి వారిద్దరిని కలపటం వల్ల కేసీఆర్ కు ప్రత్యక్షంగా వచ్చిపడే ప్రయోజనం లేదు. కాకుంటే.. రాజకీయ ప్రత్యామ్నాయం కోసం రామోజీ ఆలోచించినప్పుడు జగన్ కనిపించాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెప్పొచ్చు. చంద్రబాబును కాదని మరొకరి వంక రామోజీ చూస్తారా? అంటే.. 2004 ఎన్నికల సమయంలో వైఎస్ కు మద్ధతు ఇచ్చిన రామోజీని మర్చిపోకూడదు.

అలాంటి పరిస్థితి ఈ రోజు కాకపోతే రేపు.. అది కూడా కాకపోతే కొన్నేళ్లకైనా రాక మానదు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయం ఒకటి ఏర్పాటు చేయటమే కేసీఆర్ లక్ష్యం. ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్లు జరిగితే.. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి.. ఒకనాటి తనకు గురువుగా వ్యవహరించిన బాబును రాజకీయంగా దెబ్బ తీసిన వారు అవుతారు. అంటే.. ఏపీలో ఉండి తెలంగాణ రాజకీయాల్ని తాను ప్రభావితం చేయాలని చంద్రబాబు ఏ విధంగా అయితే ఆశిస్తారో.. అదే తరహాలో తాను తెలంగాణలో ఉండి ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేయాలని కేసీఆర్ ఆశించటం అత్యాశ కాదు కదా.