Begin typing your search above and press return to search.

మూడు సర్వేలు చేయిస్తున్న కేసీఆర్.. అసలు కథేంటి?

By:  Tupaki Desk   |   8 July 2022 7:33 AM GMT
మూడు సర్వేలు చేయిస్తున్న కేసీఆర్.. అసలు కథేంటి?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎనిమిదేళ్లుగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ కు దుబ్బాక ఉప ఎన్నిక నుంచి వ్యతిరేక పవనాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవడంతో అక్కడ ఓడిపోయామని భావించినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ కొట్టింది. అయితే ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ హవా సాగింది. అయితే అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో మాత్రం రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఏ ఎన్నికకు తేలిగ్గా తీసుకోకూడదని భావించిన గులాబీ దళపతి అక్కడ దళితబంధు పేరిట కోట్లు కుమ్మరించారు. ఒక్కో ఓటుకు ఆ ఎన్నికల్లో రూ.6వేల వరకూ పంచారని సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయినా కూడా బీజేపీని హుజూరాబాద్ లో ఓడించలేకపోయారు. అప్పటినుంచి బీజేపీతో కేసీఆర్ కాస్త గట్టిగా పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా పుంజుకోవడంతో కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా టీఆర్ఎస్ పరిస్థితిపై రాష్ట్రంలో మూడు సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మూడ్‌లోకి వెళ్లి ప్రజల మూడ్‌ను అంచనా వేయడం ప్రారంభించింది. పార్టీ తమ 2023 ప్రచారాన్ని రూపొందించడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంది. ప్రశాంత్ కిషోర్ బృందాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అవకాశాలపై సర్వే చేస్తున్నాయి. ఐ-ప్యాక్‌తో పాటు, ముప్పై మూడు జిల్లాల అన్ని జిల్లాల ఇంచార్జ్‌లు కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకునేందుకు ముందుకు వచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఆ పని చేసి ఆగస్ట్ 15లోపు నివేదిక ఇవ్వాలని కోరింది.

ఇలా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు మూడు రకాల సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, ప్రత్యర్థులు, ఎమ్మెల్యేల పని తీరు, గెలుపు అవకాశాలపై అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి సర్వేలు నిర్వహిస్తూనే ఉన్నారు కేసీఆర్. కానీ ఆ తర్వాత తొలిసారిగా అధికార పార్టీకి వ్యతిరేక సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. బీజేపీ ఒక్కసారిగా యాక్టివ్‌గా మారడంతో టీఆర్ఎస్ లో గుబులు రేగుతోంది. కొందరిలో ఆందోళన కూడా మొదలైనట్టు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్‌ తన సాక్స్‌ పైకి లాగాల్సి వచ్చింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు కష్టమేనని సర్వేల్లోతేలిందట.. కనీసం 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కుతాయని ఓ అంతర్గత సర్వేలో తేలిందట.. టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేల నివేదిక ఒకటి బయటపడింది. ఈ సర్వే ఏజెన్సీలు చాలా మంది మొదటి, రెండో టర్మ్ గెలిచిన ఎమ్మెల్యేలు చాలా పేలవంగా రాణించారని, వారిని సరిగ్గా సెట్ చేయడానికి వారికి టీఆర్ఎస్ కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని సూచించాయట..

రెండు సార్లు గెలవడం.. మూడో సారి తీవ్ర వ్యతిరేకత ఉండడంతో టీఆర్ఎస్ ఈసారి దేశంలోనే పెద్ద రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. పీకే ఎన్నికల వ్యూహం.. రాజకీయ బ్రాండింగ్ ఖచ్చితంగా టీఆర్ఎస్ కి సహాయం చేస్తుందని పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్ తన ఐటీ సెల్, డిజిటల్ టీమ్‌లను కూడా పెంచుకుంటోంది. పార్టీ డిజిటల్ ప్రచారాల కోసం పెద్ద సంఖ్యలో బృందాలను నియమించారు.

రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ ఇప్పటినుంచే రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ 70 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై తొలి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం సాగుతోంది. నాయకుల బలం, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చరుకుగా ఉన్నారా? అనే అంశాలను ఐప్యాక్ ఆరాతీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 40 మందికి టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వదన్న ప్రచారం ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది.

మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వ్యతిరేకతను తగ్గించుకొని గెలుపు బాట పట్టేందుకు ఉన్నందుకు అవకాశాలను వినియోగించుకుంటోంది. వరుస సర్వేలు చేస్తూ తమ అదృష్టం పరీక్షించుకుంటోంది.