Begin typing your search above and press return to search.

ముంద‌స్తుకు వెళుతున్న వేళ‌.. కేసీఆర్ కు అవార్డు

By:  Tupaki Desk   |   6 Sep 2018 6:35 AM GMT
ముంద‌స్తుకు వెళుతున్న వేళ‌.. కేసీఆర్ కు అవార్డు
X
మ‌రికొద్ది గంట‌ల్లో శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేసి.. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అనుకోని రీతిలో ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ అవార్డును ప్ర‌క‌టించింది. వ్యాపార రంగంలో సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికిన నేత‌ల‌కు ప్ర‌ముఖ మీడియా సంస్థ అయిన ఎక‌నామిక్స్ టైమ్స్ అందించే బిజినెస్ రీఫార్మ‌ర్ అవార్డును ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అక్టోబ‌రు 27న ముంబ‌యిలో నిర్వ‌హించే ఒక కార్య‌క్ర‌మంలో కేసీఆర్ కు ఈ అవార్డును అందించ‌నున్నారు. త‌మ అవార్డును స్వీక‌రించాల‌ని స‌ద‌రు మీడియా సంస్థ తెలంగాణ రాష్ట్ర సీఎంకు ఈ మొయిల్ కు పంపింది. ఎన్నిక‌ల‌కు వెళ్లే వేళ‌లో వ‌రించి వ‌చ్చిన ఈ అవార్డుకు ప్ర‌చారం క‌ల్పిస్తూ సీఎంవోఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

త‌న‌కొచ్చిన అవార్డుపై కేసీఆర్ స్పందించిన‌ట్లుగా తెలుపుతూ.. అవార్డు తీసుకోవ‌టానికి తాను వ‌స్తాన‌న్న స‌మాచారాన్ని స‌ద‌రు మీడియా సంస్థ‌కు స‌మాచారం అందించారు. త‌న‌కొచ్చిన అవార్డు త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చిన‌ట్లు కాద‌ని.. తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన గుర్తింపుగా తాను భావిస్తున్న‌ట్లుగా కేసీఆర్ వెల్ల‌డించిన‌ట్లుగా సీఎంవో ప్ర‌క‌టించింది.

రాష్ట్రం గ‌డిచిన నాలుగేళ్లుగా స‌గ‌టున 17.17 శాతం వృద్ధి రేటును సాధిస్తే.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నాలుగు నెలల్లో 21.96 శాతం వృద్ధిని సాధించిన‌ట్లుగా పేర్కొన్నారు. అవినీతికి ఏ మాత్రం అవ‌కాశం లేకుండా పారిశ్రామిక‌వేత్త‌లు ఇబ్బంది ప‌డ‌కుండా తాము స్టార్ట్ చేసిన టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమ‌తుల విధానం మంచి ఫ‌లితాల్ని ఇస్తున్నట్లుగా ప్ర‌క‌టించారు.

ఈ విధానం ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ 7వేల ప‌రిశ్ర‌మ‌లు అనుమ‌తులు పొందాయ‌న్నారు. రాష్ట్ర స‌ర్కారు అమ‌లు చేస్తున్న పారిశ్రామిక విధానాన్ని దేశ‌.. విదేశీ వ్యాపార సంస్థ‌లు.. పారిశ్రామిక‌వేత్త‌లు అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. మామూలుగా అయితే.. ఇలాంటి అవార్డులుస్వీక‌రించేందుకు త‌న‌కు బ‌దులుగా త‌న కొడుకును పంప‌టం కేసీఆర్ కు అల‌వాటుగా చెబుతారు. కానీ.. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ఎన్నిక‌ల ముందు ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇచ్చే అవార్డును స్వ‌యంగా అందుకోవ‌టంతో వ‌చ్చే మైలేజీని కేసీఆర్ లాంటి నేత ఎందుకు వ‌దులుకుంటారు చెప్పండి?