Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇంకో షాక్ రెడీ చేస్తున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   29 April 2022 7:32 AM GMT
తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇంకో షాక్ రెడీ చేస్తున్న కేసీఆర్‌
X
అట్ట‌హాసంగా ప్లీన‌రీ నిర్వ‌హించి... జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగుపెడ‌తామ‌ని ప్ర‌క‌టించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌... దేశాన్ని ప్ర‌భావితం చేసే నిర్ణ‌యాల‌ను మ‌న గ‌డ్డ‌పై తీసుకోవ‌డం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని పెంచుతాన‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇలా తెలంగాణ స‌త్తా చాటేందుకు కార్యాచ‌ర‌ణ వెల్ల‌డించిన గులాబీ ద‌ళ‌ప‌తి ఇదే స‌మ‌యంలో త‌న రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు ఓ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇదంతా సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ఎక్కువ‌గా ఆధార‌ప‌డే ఆర్టీసీ చార్జీల పెంపు గురించి. త్వరలోనే ఆర్టీసీ చార్జీలు పెంచుతామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఈ మేర‌కు ఓకే చేయించుకుంటామ‌ని వెల్ల‌డించారు.

తార్నాకలోని ఆర్టీసీ ఉద్యోగుల‌కు చెందిన ఆస్ప‌త్రిలో నర్సింగ్ కాలేజీని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ డీజిల్‌పై కేంద్రం సుమారు రూ.40 పెంచిందన్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను కేంద్రం అమ్ముకొస్తున్నదని ఆరోపించారు. అలాంటి సందర్భంలో టీఎస్ ఆర్టీసీని కాపాడుకుంటున్నామని అన్నారు.

కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగానే ఆర్టీసీ చార్జీల పెంపుపై స్పందించారు. ‘‘ఇప్పటి వరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. డీజిల్ సెస్ లాంటి ఒకటి రెండు అంశాలతో చార్జీల పెంపు జరిగింది. ప్రజలు అంగీకరించారు.. సీఎం కేసీఆర్ ను కలిసి ఛార్జీలు పెంచాలని కోరుతం..” అని షాకింగ్ న్యూస్ వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగానే కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి పువ్వాడ అజ‌య్ మండిప‌డ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచుతూ రాష్ట్రాలను వ్యాట్ తగ్గించాలని అడుగుతున్నది. ఇదెక్కడి న్యాయం.. పెంచేది మీరు తగ్గించాల్సింది మేమా?” అని మంత్రి ప్రశ్నించారు.

డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల ఆర్టీసీ అభివృద్ధికి అడ్డంకిగా మారింద‌ని మండిప‌డ్డారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వంపై, బీజేపీ పాల‌న‌పై మంత్రి పువ్వాడ అజ‌య్ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో... కాషాయ పార్టీ సైతం అదే రీతిలో స్పందిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇప్ప‌టికే ఖ‌మ్మంలో ఓ బీజేపీ కార్య‌క‌ర్త మ‌ర‌ణం విష‌యంలో మంత్రి పువ్వాడ‌ను టార్గెట్ చేస్తున్న బీజేపీ ... ఇప్పుడు ఇటు చార్జీల పెంపు అటు త‌మ‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్‌గా అదే రీతిలో రియాక్ట‌వ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.