Begin typing your search above and press return to search.

కేసీఆర్ తెలివే తెలివి.. వానల సెలవుల అసలు లెక్క ఇదేనట

By:  Tupaki Desk   |   14 July 2022 5:30 AM GMT
కేసీఆర్ తెలివే తెలివి.. వానల సెలవుల అసలు లెక్క ఇదేనట
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో వరుస పెట్టి ఆరేడు రోజులు వర్షాలు పడటం.. సూరీడు అనేటోడే కనిపించకపోవటం ఇప్పుడేనని చెప్పాలి. ఎప్పటి మాదిరి వర్షాలు జూన్ లో మొదలయ్యే దానికి భిన్నంగా నెల ఆలస్యంగా వచ్చిన వరుణుడు.. సూరీడ్ని పూర్తిగా డామినేట్ చేయటమే కాదు.. దాదాపు వారం పాటు సూరీడు కనిపించకుండా వరుణుడు తెలంగాణ వ్యాప్తంగా కమ్మేసిన వైనం తెలిసిందే. దీంతో.. పెద్ద ఎత్తున వర్షాలతో పాటు.. చలి తీవ్రతతో ప్రజలు వణికే పరిస్థితి.

ఇలాంటివేళ.. అనూహ్యంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు చెబుతున్నా.. దానికి అసలు కారణం వేరే ఉన్నట్లు చెబుతున్నారు. వర్షాల వేళ.. స్కూళ్లు పని చేస్తే.. విద్యార్థులు ఇబ్బందులకు గురి కావటం మామూలు విషయమే అయినా.. ఆ కారణంతో సెలవులు ఇవ్వలేదంటున్నారు.

మొదట మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ఇవ్వటం.. వరుస పెట్టి వర్షాలు సాగుతున్న వేళ.. మరో మూడు రోజులు.. మొత్తంగా ఈ వారం మొత్తం స్కూళ్లకు సెలవులు ఇచ్చేయటం వెనుక చాలానే లెక్కలు ఉన్నట్లు చెబుతున్నారు. విడవకుండా కురుస్తున్న వర్షాల వేళ స్కూళ్లు పని చేస్తే.. వాటి మౌలిక వసతుల మీద చర్చ జరుగుతుంది. అదే సమయంలో.. స్కూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ తలనొప్పిగా మారుతుంది.

ఒకవేళ.. అనూహ్యంగా ఏదైనా జరగకూడనిది ఏదైనా జరిగితే.. ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు ఖాయం. వీటితో పాటు.. హైదరాబాద్ మహానగరంతో పాటు దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి.. మేడ్చల్.. మెదక్ జిల్లాల శివారుకు సంబంధించి చూస్తే.. పెద్ద పెద్ద ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి వందలాది బస్సులు ఉండటం. అవన్నీ రోడ్ల మీదకు వస్తే.. ఎంత ఆగమాగం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీనికి తోడు.. విడవకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిన వేళ.. ట్రాఫిక్ జాంలు మరింత పెరగటమే కాదు.. వాహనాల సగటు వేగం మీదా భారీగా పడనుంది. అదే జరిగితే.. ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని తిట్టుకోవటం ఖాయం. అందుకే.. సెలవులు ఇచ్చేయటం ద్వారా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంతవరకు ఇళ్లకే పరిమితం కావాలన్న సందేశాన్ని ఇచ్చినట్లైంది.

పేరుకు స్కూళ్లకు సెలవులు అన్నట్లుగా కేసీఆర్ సర్కారు నిర్ణయం కనిపిస్తుంది కానీ.. అసలు విషయం మాత్రం మరింత ఉందన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఏమైనా ఇలా ఒక విషయాన్ని లోతుగా పరిశీలించే విషయంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.