Begin typing your search above and press return to search.

బీజేపీకి చెక్ పెట్టే నేత ఆయ‌నేనా ? తెలుగు రాష్ట్రాల్లో సీరియ‌స్ చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   7 April 2021 2:30 AM GMT
బీజేపీకి చెక్ పెట్టే నేత ఆయ‌నేనా ?  తెలుగు రాష్ట్రాల్లో సీరియ‌స్ చ‌ర్చ‌
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రం ఏపీనే. అప్ప‌టి హామీలు ఒక్క‌టి కూడా నేటికీ నెర‌వేర‌లేదు. క‌నీసం ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌న పెట్టినా. పోల‌వ‌రం.. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు.. ఇత‌ర‌త్రా కేంద్ర ప‌థ‌కాలు.. ప్రాజెక్టుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఏపీని ప‌ట్టించుకోవ‌డం లేదు. కేంద్రం అంటే.. బీజేపీ నేత‌లు. మ‌రి వీరిని ప్ర‌శ్నించే నాయ‌కులు ఏపీలో ఎవ‌రున్నారు ? ఇదే ప్ర‌శ్న‌.. అటు ప్ర‌జ‌ల్లోనూ.. ఇటు సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే.. దీనికి స‌మాధానం ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి ఎందుకంటే.. అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీతో ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ స‌ర్దుకు పోయేందుకు రెడీగా ఉంది. ఈ విష‌యాన్ని సీఎంగా బాధ్య‌త‌లు తీసుకోకముందుగానే జ‌గ‌న్ ఢిల్లీలోనే చెప్పేశారు.

ఇక‌, ఆత‌ర్వాత కూడా ఆయ‌న ఎప్పుడు కూడా కేంద్రాన్ని ఏపీ ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌శ్నించింది లేదు. పైగా.. కేంద్రం అమ‌లు చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు, రైతు వ్య‌తిరేక విధానాలు, చ‌ట్టాల‌కు సైతం.. ఆయ‌న మ‌ద్ద‌తు చెబుతున్నార‌నే వాద‌న తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ 2019 ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మోడీని ఓడిస్తామంటూ. పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసింది. హోదా ఇవ్వ‌రు, పోల‌వ‌రం సాగ‌నివ్వ‌రు.. మోడీ ఏపీకి ప‌ట్టిన శ‌ని అంటూ.. అప్ప‌ట్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఆయ‌న మౌనం పాటిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర స‌ర్కారుపై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు త‌ప్ప‌..కేంద్రంపై ప‌న్నెత్తు మాట అన‌డం లేదు.

వీరిద్దరి విష‌యంలోనూ.. కేసులు ఉన్నాయ‌ని.. అందుకే మాట్లాడ‌డం లేద‌నే ప్ర‌చారం ఉంది. జ‌గ‌న్ ఇప్ప‌టికే 16 నెల‌లు జైల్లో ఉండి రావ‌డం.. చంద్ర‌బాబుపై ఓటుకు నోటు కేసు విచార‌ణ‌లో ఉండ‌డం.. గ‌త స‌ర్కారులో అవినీతి వంటివి ఈ ఇద్ద‌రు నేత‌లు బీజేపీపై నోరెత్తే ప‌రిస్థితి లేకుండా చేశాయ‌నే విశ్లేష‌ణ‌లు వున్నాయి. మ‌రి ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి? ప్ర‌శ్నిస్తానంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న ఎవ‌రినీ ప్ర‌శ్నించ‌డం లేదు. ముఖ్యంగా ఏపీ ప్ర‌యోజ‌నాల‌పై ఆయ‌న మౌనంగా ఉంటూ. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతోనే జ‌ట్టుక‌ట్టారు. అంటే.. ఆయ‌న ప్యాకేజీ స్టార్‌గా మారార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా ఏపీకి చెందిన ముగ్గురు కీల‌క నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు.

మ‌రి బీజేపీపైనా.. ముఖ్యంగా మోడీపైనా యుద్ధం చేసే స‌త్తా ఎవ‌రికి ఉంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మే.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలోను, మేధావుల చ‌ర్చ‌ల్లోనూ వినిపిస్తున్న‌మాట‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఆయ‌న మాత్ర‌మే.. రెండు తెలుగు రాష్ట్రాల త‌ర‌ఫున కేంద్రంపై పోరాడే స‌త్తా ఉన్న నాయ‌కుడిగా.. చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌రణ‌ను రాష్ట్ర నేత‌లు వ్య‌తిరేకించిన స‌మ‌యంలోనే ఆయ‌న కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్య‌తిరేకించారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. తాను కూడా అక్క‌డ‌కు వ‌చ్చి నిర‌స‌న వ్య‌క్తం చేస్తాన‌ని అన్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కేసీఆరే స్వ‌యంగా రంగంలోకి దిగి.. రాష్ట్రాల‌పై మోడీ పెత్త‌నాన్ని ప్ర‌శ్నించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఆయ‌న తీసుకునే పాయింట్ల‌లో విశాఖ ఉక్కు కూడా ఓ బ‌ల‌మైన ఆయుధంగా చేసుకుని ముందుకు సాగుతార‌ని అంటున్నారు. అంటే.. ఏపీ నేత‌లు డ‌మ్మీలైనా.. ఒక్క కేసీఆర్‌మాత్ర‌మే బీజేపీపై యుద్ధం చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్టు మేధావులు భావిస్తున్నారు. మ‌రి కేసీఆర్ పోరాట ప‌టిమ‌ను చూసి అయినా ఏపీ నేత‌ల్లో క‌ద‌లిక వ‌స్తుందేమో ? చూడాలి.