Begin typing your search above and press return to search.

మొద‌ట.. చివ‌రి బీఫారంలు ఎవ‌రివి?

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:43 AM GMT
మొద‌ట.. చివ‌రి బీఫారంలు ఎవ‌రివి?
X
ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు తీసుకోవ‌టం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముందుంటారు. రాజ‌కీయాల్లో ఇలాంటివి సాధ్య‌మేనా? అన్న సందేహాలు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించ‌టం ఆయ‌న‌కు అల‌వాటే. ప్ర‌స్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో ఒక అధికార పార్టీ మొత్తం అభ్య‌ర్థుల్లో దాదాపు 80 శాతానికి పైగా అభ్య‌ర్థుల‌ను హోల్ సేల్ గా ప్ర‌క‌టించ‌టం సాధ్య‌మేనా? అంటే నో అంటారు. కానీ.. అలాంటి సినిమాటిక్ సీన్ల‌ను విజ‌య‌వంతంగా చేయ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. ఎవ‌రి ఒత్తిళ్ల‌కు లోను కాకుండా తాను న‌మ్ముకున్న లెక్క‌ల‌తో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌టం.. చివ‌ర‌కు త‌న రాజ‌కీయ వార‌సుడైన కొడుకు అభిమ‌తానికి సైతం విలువ ఇవ్వ‌కుండా.. నా లెక్క‌లు నావి.. వాటిల్లోకి ఎవ‌రి జోక్యాన్ని తాను స‌హించ‌న‌ని క‌రాఖండిగా వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మేమో?

మొద‌ట్నించి చెబుతున్న‌ట్లే.. అభ్య‌ర్థులంద‌రిని పిలిచి.. వారికి గెలుపు పాఠాల్ని కాసేపు బోధించి చివ‌ర్లో బీఫారాలు చేతుల్లో పెట్టారు. బీఫారాలు ఇచ్చే విష‌యంలో కేసీఆర్ షాకులు ఇస్తార‌న్న మాట త‌ప్ప‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న చేత‌ల ద్వారా ఫ్రూవ్ చేశారు. అంతేకాదు.. బీఫారాలు ఇచ్చే విష‌యంలోనూ నాట‌కీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు.

మొద‌టి బీఫారంను సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ అభ్య‌ర్థి కోనేరు కోన‌ప్ప‌కు కేసీఆర్ అంద‌జేశారు. ఆ త‌ర్వాత మ‌రో 104 మందికి బీఫారంలు అంద‌జేసిన కేసీఆర్‌.. చివ‌రి బీఫారంను తాను తీసుకున్నారు. అభ్య‌ర్థులంద‌రికి తానే స్వ‌యంగా బీఫారంను ఇచ్చిన కేసీఆర్‌.. త‌న బీఫారంను మాత్రం తాజా మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.కేశ‌వ‌రావు చేతుల మీదుగా తీసుకున్నారు.

బీఫారం ల‌ను అంద‌జేసిన సంద‌ర్భంలో నామినేష‌న్ల విష‌యంపై పార్టీ అభ్య‌ర్థుల‌కు ప‌లు జాగ్ర‌త్త‌ల్ని చెప్పారు. నామినేష‌న్ల కార్య‌క్ర‌మంలో అభ్య‌ర్థులంతా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని..అయిదుగురితోనే వెళ్లి ఎలాంటి లోటుపాట్ల‌కు తావివ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. లాయ‌ర్ ను పెట్టుకొని నామినేష‌న్ల కార్య‌క్ర‌మం సాఫీగా సాగేలా చూసుకోవాల‌న్నారు. రూల్స్ ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ్రేక్ చేయొద్ద‌న్న ఆయ‌న‌.. పోలీసు అధికారుల‌తో ఎలాంటి వివాదాన్ని పెట్టుకోవ‌ద్ద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. అఫిడ‌విట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ఇప్ప‌టికే కేసులు ఉంటే ఆ విష‌యాల్ని వెల్ల‌డించాల‌న్నారు. నామినేష‌న్ల‌కు చివ‌రి రోజైన 19 వ‌ర‌కూ ఆగ‌కుండా.. 18నే వేసేయాల‌ని చెప్పారు. అభ్య‌ర్థుల‌కు నామినేష‌న్ల దాఖ‌లు విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్నిచెప్పుకొచ్చారు.