Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టుపై మ‌రో మార్పు

By:  Tupaki Desk   |   17 May 2016 12:04 PM GMT
కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టుపై మ‌రో మార్పు
X
బుద్ధుడి వెనుక అంబేద్కర్ విగ్రహం...ఆయనకు ఎదురుగా సచివాలయం ఉంటే పరిపాలన బాగుంటుంది... ఇది ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సమయంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన‌ కామెంట్‌. తెంల‌గాణ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు స‌చివాల‌యం త‌ర‌లింపు ఉంటుంది...ఉండ‌దు...అనే చ‌ర్చోప‌చ‌ర్చ‌ల స‌మ‌యంలో కేసీఆర్ త‌న‌దైన శైలిలో చేసిన ఈ స్టేట్‌ మెంట్‌ తో ఓ క్లారిటీ ఇచ్చారని అంతా భావించారు. సచివాలయ తరలింపు ఇంక లేనట్టే అని అనుకున్నారు. కానీ తాజా జీవోతో సెక్రటేరియట్ కొత్త భవనం నిర్మాణంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి..

తాజాగా జీవో నంబర్ 172ను కొత్తగా జారీ చేసి కీల‌క నిర్మాణాల‌పై ఉన్న‌తాధికారుల క‌మిటీ ఏర్పాటుచేశారు. ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చైర్మన్ గా, మరో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ తో పాటు ఉన్నతాధికారుల క్వార్టర్లు - సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణాలపై ప్రభుత్వానికి సీఎస్ కమిటీ సూచనలు చేయనుంది. సచివాలయానికి కొత్త భవనం నిర్మాణంపై ప్రభుత్వం మళ్లీ దృష్టి పెట్టింద‌నుకే తాజాగా జీవో విడుద‌ల చేయ‌డం తార్కాణంగా చెప్తున్నారు.

గతంలో ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ దగ్గర 72 ఎకరాల్లో సచివాలయాన్ని కొత్తగా నిర్మించాలని కేసీఆర్‌ సర్కార్ నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. అందుకోసం అప్పట్లో జీవో నంబర్ 166ను విడుదల చేసింది. ఈ జీవోను పక్కన పెడుతూ ర‌క‌ర‌కాలా నిర్ణ‌యాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో క‌మిటీ వేస్తూ జీవో నంబ‌రు 172ను విడుద‌ల చేశారు. అయితే కొత్త సెక్రటేరియట్ ను ఎక్కడ కట్టేదీ ప్రస్తావించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండ‌గా...సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్‌ కు ఇటీవ‌లే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన సంగ‌తి తెలిసిందే.