Begin typing your search above and press return to search.

కమాండ్ కంట్రోల్ సెంటర్ క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   5 Aug 2022 6:47 AM GMT
కమాండ్ కంట్రోల్ సెంటర్ క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వేసిన కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్రంలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యాల్లో ఒకటి.. ఏ ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ ఎక్కువగా ప్రొజెక్టు కాకూడదు. ఫలానా ఆఫీసర్ చాలా బాగా పని చేస్తున్నారంటూ మీడియాలో వచ్చినా.. ప్రజల్లో చర్చ జరిగినా.. ఆ వెంటనే వారికి స్థానభ్రంశం తప్పదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే.. గడిచిన ఎనిమిదేళ్లలో పలువురు అధికారులు ఇలాంటి ప్రచారాల కారణంగా.. తమకున్న మంచి పోస్టుల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారు. మొత్తంగా తెలంగాణలో ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి తప్పించి.. మరెవరికీ ప్రత్యేక ఇమేజ్ ఉండకూడదన్నట్లుగా విషయం ఉండాలన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టతతో ఉంటారని చెబుతారు. ఎందుకిలా? అన్న దానికి వెంటనే సమాధానం చెప్పకున్నా.. అలాంటివి ముఖ్యమంత్రికి నచ్చవన్న మాట వారి నోటి నుంచి వస్తూ ఉంటుంది. అందుకే.. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఐఏఎస్ అధికారికి.. ఐపీఎస్ అధికారికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉండదు. కొందరు ఐఏఎస్ లు అయితే.. తమకు సంబంధించిన ఏదైనా పాజిటివ్ స్టోరీలు వస్తున్నాయన్న విషయం తెలిస్తే.. వెంటనే ఆయా మీడియా సంస్థల వారిని రిక్వెస్టు చేసి మరీ.. తమ గురించి.. తమ పని తీరు గురించి ప్రత్యేకంగా రాయొద్దని చెప్పటం కనిపిస్తుంటుంది.

సాధారణంగా.. నెగిటివ్ స్టోరీలు.. నెగిటివ్ వార్తల విషయంలో ఇలాంటి రిక్వెస్టులు ఉంటాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం పని తీరు బాగుందన్న వార్తలు అస్సలు వద్దని.. అలా అని నెగిటివ్ కూడా వద్దంటారు. సీనియర్ అధికారులు మొదలు జూనియర్ అధికారుల వరకు.. ‘‘పాజిటివ్ వద్దు.. నెగిటివ్ వద్దు.. ఏదో మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి.. నెగిటివ్ వద్దంటూ మీరు వినరు కదా? కాబట్టి అందులో నియంత్రించలేం. కానీ.. పాజిటివ్ మాత్రం రాయొద్దు. ఈ స్పెషల్ రిక్వెస్టును మాత్రం మీరు కాదనకూడదు’ అంటూ వ్యాఖ్యానించటం వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పొగడటం మాత్రం ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని అదే పనిగా పొగడటం కనిపిస్తుంటుంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్ క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలోనే వేయాలన్న మాట సీఎం కేసీఆర్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది. ఇంతలా ఇటీవల కాలంలో ఏ అధికారిని సీఎం పొగిడింది లేదని చెబుతారు. ఈ పొగడ్తల వెనుక మర్మం మొదట్లో చాలామందికి అర్థం కాలేదు. వారంతా అయోమయంగా ఉన్న వేళలో.. తన ప్రసంగం చివరల్లో ఆ సందేహాలకు సమాధానాలు ఇచ్చేయటం గమనార్హం.

ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా వ్యవహరిస్తున్న మహేందర్ రెడ్డి త్వరలో రిటైర్ అవుతారన్న విషయం సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చేసింది. అందుకు బదులుగా ఆయనకు యూనిఫారం లేకుండా సేవలు అందించటానికి వీలుగా ఆయన సిద్ధంగా ఉండాలని కోరటం విశేషం. సాధారణంగా ఒక సీనియర్ అధికారి పని బాగా నచ్చితే.. ఆయనకు ఎక్సటెన్షన్ ఇవ్వటం పెద్ద విషయం కాదు. అందుకు భిన్నంగా ఆయన ప్లేస్ లో మరొకరిని నియమించటానికి వీలుగా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పేసిన వైనం చూస్తే.. మహేందర్ రెడ్డి ఖాతాలో సీసీఎస్ క్రెడిట్ వేసి.. చివరకు చెప్పింది ఇదా? అన్న మాట వినిపిస్తోంది.