Begin typing your search above and press return to search.

కేసీఆర్ గడుసుతనం.. 40వేల పోస్టులకు ఏపీకి లింకెట్టేశారు

By:  Tupaki Desk   |   10 March 2022 8:30 AM GMT
కేసీఆర్ గడుసుతనం.. 40వేల పోస్టులకు ఏపీకి లింకెట్టేశారు
X
మొన్నటి వరకు ప్రాంతీయవాదం. ఆ మాటకు వస్తే ఇప్పటికి తెలంగాణ చుట్టూనే మాటలు సాగే తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్ని చేస్తామని చెబుతూనే.. ప్రాంతీయ పరిమితుల్ని దాటకుండా చెప్పే మాటల్ని చూస్తే.. చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయం మరోసారి స్పష్టమవుతుంది.

బుధవారం ఉదయం పది గంటలకు తెలంగాణ ప్రజలంతా టీవీల్ని చూడాలని ఊరించిన సీఎం కేసీఆర్.. ఉద్యోగాల భర్తీ విషయంపై కీలక ప్రకటన చేస్తారని మీడియాతో పాటు.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

దీనికి తగ్గట్లే.. తెలంగాణరాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణలో భారీ జాబ్ మేళాపై కీలక ప్రకటన చేయటం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్.. 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. తాము చేస్తున్న తాజా జాబ్ మేళాలోనే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను చేస్తామని.. 11,103 మంది లబ్థి పొందుతారని చెప్పారు.

ఇవన్నీ బాగానే ఉన్నా.. తన వరాల మూటను విప్పినక్రమంలోనూ ఏపీ మీద ఆయనకున్న వ్యతిరేకతను దాచుకోలేదు. ఏపీని ఎంతగా తిడితే అంతలా సెంటిమెంట్ రాజుకుంటుందన్న పాత ఫార్ములాను బయటకు తీసిన ఆయన.. విభజన పంచాయితీ తీరితే మరో 40 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పటం చూస్తే.. ఏపీ మీద ఆయనకున్నకసి పోదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసే కేసీఆర్.. రాష్ట్ర విభజన అన్నది చాలా తేలికైన ప్రక్రియ అని.. ఒక్కసారి ఓకే అనాలే కానీ వారంలో అన్ని ఇష్యూలు క్లోజ్ చేయొచ్చన్న మాటను చెప్పేవారు.

అలాంటి కేసీఆర్.. తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇన్నేళ్లుగా విభజన సమస్యల్ని ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేదు. ఇవాల్టి రోజున ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఏపీ మీద గురి పెట్టే కేసీఆర్.. ఆంధ్రోళ్ల కారణంగా తెలంగాణ ఎంత నష్టపోయిందన్న మాటను పదే పదే ప్రస్తావించటం దేనికి నిదర్శనం? తనకు రాజకీయ లబ్థి అవసరమైనప్పుడల్లా ఏపీ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయటం.. ఏపీ కారణంగా తెలంగాణ ఎంత నష్టపోయిందన్న విషయాన్ని చెప్పటం చూస్తున్నదే.

తాజాగా ఉద్యోగాల భర్తీకి ఏపీకి లింకు పెట్టేసిన తెలివిని చూస్తే.. ఏపీ మీద ఆయనకున్నకసి ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఇలా ఎందుకంటే.. నిజంగానే తెలంగాణ నిరుద్యోగుల సమస్యల్ని తీర్చటం.. తాను హామీ ఇచ్చిన రీతిలో ఉద్యోగ ప్రకటన చేయటమే ముఖ్యమైతే.. ముందు ఆ పని ఎప్పుడో పూర్తి చేయాలి.

దాదాపు ఎనిమిదేళ్లు తాను అధికారంలో ఉండి.. భర్తీ చేయాల్సిన దాదాపు లక్షకు పైగా పోస్టుల్లో 91 వేల పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లుగా ఎందుకుచెప్పటం? తరచూ ఏపీ మీద పడే పెద్ద మనిషి.. తెలంగాణలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల్ని భర్తీ చేస్తామంటే ఏపీ ప్రజలు కానీ పాలకులు కానీ ఆపరు కదా? ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకులేదు? అన్నది మరో ప్రశ్న. ఖాళీగా ఉన్నవేలాది పోస్టుల్ని ఏళ్లకు ఏళ్లుగా భర్తీ చేయకుండా కూర్చున్న కేసీఆర్.. వాటి సంగతి చూడక.. ఏపీ ప్రస్తావన తేవటం దేనికి నిదర్శనం? అన్నది చూస్తే ఆయన గడుసుతనం ఇట్టే అర్థమవుతుంది.

తన తప్పుల్ని కవర్ చేసేందుకు ఏపీ ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. ఆంధ్రా ప్రభుత్వం కారణంగా మనమెంత నష్టపోతున్నామన్న భావన కలిగేలా చేయటం కేసీఆర్ వ్యూహంగా చెప్పక తప్పదు. చేతిలో ఉన్న లక్ష పోస్టుల్ని భర్తీ చేసేసి.. ఏపీ మీద పడితే బాగుంటుంది. తెలంగాణ ప్రజల భుజాన గన్ పెట్టి సెంటిమెంట్ తూటాను ఏపీకి గురి పెట్టి పవర్ పాలిటిక్స్ చేసుడు ఇంకెంత కాలం కేసీఆర్? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి.