Begin typing your search above and press return to search.

ఉద్యోగాల్లో.. 95 శాతం కోటా.. కేసీఆర్ వ్యూహం ఏంటి? కోర్టులు ఏం చెప్పాయి

By:  Tupaki Desk   |   9 March 2022 10:02 AM GMT
ఉద్యోగాల్లో.. 95 శాతం కోటా.. కేసీఆర్ వ్యూహం ఏంటి?  కోర్టులు ఏం చెప్పాయి
X
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. 80,039 పోస్టులకు నేటి నుంచే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. ఈ ఖాళీలన్నింటికీ 95 శాతం లోకల్‌ కోటాగా స్థానికులకు వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లలో 95% ఉద్యోగాలు కలిగి ఉంటారు. ఇతర జిల్లాలు , జోన్లు, మల్టీ జోన్‌లలో 5% ఓపెన్‌ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన 95శాతం ఉద్యోగ కోటా నిజంగానే అమ‌లవుతుందా? నిజంగానే ఆయ‌న‌కు అమ‌లు చేయాల‌నే చిత్త‌శుద్ధి ఉందా? లేక‌.. ఏదో రావాల‌నే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నా రా? అనేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల‌కు మంచి క‌బురు చెబుతాను.. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు అంద‌రూ టీవీలు చూడండి.. అని సీఎం కేసీఆర్ ముందుగానే ప్ర‌క‌టించారు.

దీంతో ఏదో అద్భుతం జ‌ర‌గ‌బోతోంద‌ని.. అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రంలోని గ్రూప్ 1, గ్రూప్ 2 స‌హా అన్ని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయనున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అదేస‌మ‌యంలో ఆయ‌న మొత్తం ఉద్యోగాల్లో స్థానికుల‌కు 95 శాతం కోటా ప్ర‌క‌టించారు. మిగిలిన 5శాతం జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. అంటే.. ఇత‌ర జిల్లాలు, ప్రాంతాల వారికి కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఉద్యోగాలు కేటాయించారు. అయితే.. ఇది రాజ‌కీయ జిమ్మిక్కా? నిజంగానే కేసీఆర్ ప్ర‌క‌ట‌న సాధ్యం అవుతుందా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. ఏరాష్ట్ర‌మైనా.. కేంద్ర‌మైనా.. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన కోటా ప్ర‌క‌టించే ప్పుడు... సామాజిక వ‌ర్గాల ఆధారంగా 55 శాతం మించ‌రాద‌ని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఉద్యోగాల్లో అయితే.. 60 శాతం(స్థానికులు) మించ‌రాద‌ని.. పంజాబ్‌-హ‌రియాణా.. రాష్ట్రాల (ఉమ్మ‌డిరాజ‌ధాని ఉన్న‌రాష్ట్రాలు) ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి 1999లో తీర్పు చెప్పింది.

అంటే.. స్థానికంగా ఏ రాష్ట్ర‌మైన త‌న పౌరులకు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 60 శాతం(ఆ జిల్లాలో) కోటాను మించి ఇచ్చే అవ‌కాశం లేదు. అయితే.. ఇప్పుడు దీనిని మించి అన్న‌ట్టుగా కేసీఆర్ ప్ర‌క‌ట‌న ఉంది. అయితే.. ఆయ‌న‌కు ఈ విష‌యం తెలియ‌ద‌ని అనుకునే ప‌రిస్థితి లేదు. కానీ, దీనిని రాజ‌కీయంగా ఆయ‌న వినియోగించుకునే ఉద్దేశంతోనే ఇలా చేశార‌ని అంటున్నారు. ఎందుకంటే.. నిజంగానే కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ట్టు 95 శాతం ఉద్యోగాలను తెలంగాణ వారికే ఇవ్వాల‌న్నా.. ఇక్క‌డ ఆ రేంజ్‌లో నైపుణ్యం ఉన్న వారు లేర‌నేది ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం.

ఇదే విష‌యాన్ని కేసీఆర్ గతంలోనే చెప్పారు. మ‌న ద‌గ్గ‌ర నైపుణ్యం ఉన్న యువ‌తీ యువ‌కులు లేరు అధ్య‌క్షా..అందుకే మ‌న ఉద్యోగాల‌ను పొరుగు రాష్ట్రాల‌కు చెందిన వారు.. తెచ్చుకుంటున్నార‌ని అన్నారు. మ‌రి ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఉన్నా లేకున్నా.. కేసీఆర్ ప్ర‌క‌ట‌న మాత్రం న్యాయ‌స‌మీక్ష వ‌ద్ద బోల్తా ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇది కేవ‌లం రాజ‌కీయ ప్ర‌క‌ట‌నే త‌ప్ప‌.. నిరుద్యోగుల‌ను మెప్పించే ప్ర‌క‌ట‌నే త‌ప్ప‌.. మ‌రొక‌టి కాద‌ని.. ఆచ‌ర‌ణ‌లోనూ సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. రేపు ఎవ‌రైనా.. కోర్టు వెళ్తే.. (బ‌హుశ కేసీఆర్ కోరిక కూడా ఇదే అయి ఉంటుంది) ఈ ప్ర‌క్రియ పూర్తిగా నిలిచిపోవ‌డం.. కోటా కేటాయింపుపై భారీ ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.