Begin typing your search above and press return to search.

నా గురించి ఏమ‌నుకుంటున్నారు.. కేసీఆర్ కొత్త స‌ర్వే!?

By:  Tupaki Desk   |   14 Feb 2022 11:30 PM GMT
నా గురించి ఏమ‌నుకుంటున్నారు.. కేసీఆర్ కొత్త స‌ర్వే!?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త కొద్దిరోజులుగా మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో కామెంట్లు, విశ్లేష‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తూ పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. వరుసగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిప్పులు చేరుగుతూ ప్రజల్లో కేంద్రం అన్యాయం చేస్తుందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఆందోళ‌న‌లు చేయిస్తున్నారు. దీంతోపాటుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంతో పాటు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కేంద్రం స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటూ తూర్పారపడుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అయితే, ఈ కామెంట్ల ఎపిసోడ్ ఫ‌లితాలు ఎలా ఉన్నాయో స‌ర్వే ద్వారా తెలుసుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన బహిరంగ సభల్లో మ‌రోవైపు ప్రగతి భవన్ వేదిక పెడుతున్న మీడియా సమావేశాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కేసీఆర్ విరుచుకుప‌డుతున్నారు.

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సమతామూర్తి కేంద్రంలో నెలకొల్పిన శ్రీరామానుజచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకలేదు. మ‌రోవైపు, రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడుతున్న మాటలు స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

అయితే, ఈ చ‌ర్చ‌ను కేవ‌లం ప్ర‌జ‌ల వ‌ర‌కే ప‌రిమితం చేయ‌డ‌మే కాకుండా వాటి తాలుకు ప్ర‌యోజ‌నం గురించి సైతం కేసీఆర్ అంచ‌నా వేసుకుంటున్నార‌ట‌. ఇందులో భాగంగా దేశంలోనే ప్రముఖ సంస్థతో కేసీఆర్ డిటెయిల్‌గా సర్వే చేయిస్తున్నారని స‌మాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఈ టీమ్  వారం రోజులపాటు పర్యటించి ప్రజల నాడిపై సర్వే చేయనున్నారు.

పార్లమెంట్ లో మోడీ రాష్ట్ర విభజన పై మాట్లాడిన మాటలపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు?బీజేపీని టార్గెట్ చెయ్యడాన్నీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు?  టీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది?  తెలంగాణ సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంది..ఇలాంటి అంశాలపై సర్వే చేసి ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.

త‌ర్వాత కేసీఆర్ వ్యూహం ఉండ‌నున్న‌ట్లు చెప్తున్నారు. మొత్తంగా తానే ఆయా అంశాల‌పై స్పందించి, తానే విశ్లేషించుకొని, తానే కొత్త గేమ్ ప్లాన్ రూపొందించే ఎత్తుగ‌డ‌కు కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని విశ్లేష‌కులు కామెంట్ చేస్తున్నారు.