Begin typing your search above and press return to search.
మంత్రివర్గ విస్తరణ అనబడే కేసీఆర్ లీకుల సీరియల్
By: Tupaki Desk | 23 Jan 2018 5:30 PM GMTత్వరలో మంత్రివర్గ విస్తరణ. అంతా సిద్ధమైపోయింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న ఎపిసోడ్ గురించి ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది వెనక్కు పోయిందని విశ్వసనీయవర్గాల సమాచారం. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై కేసీఅర్ పునరాలోచనలో పడ్డారు. నెలకో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, సాఫీగా ప్రభుత్వం సాగుతున్న తరుణంలో మంత్రివర్గంలో మార్పులు - చేర్పులు చేపట్టి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని, దానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి స్వస్తి చెప్పినట్టు తెలిసింది. అన్నీ బాగుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని అధికారపార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
రాష్ట్రం ఏర్పడి టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే మంత్రివర్గం విషయంలో లుకలుకలు బయటపడిన సంగతి తెలిసిందే. తమకు చోటు దక్కలేదని కొప్పుల ఈశ్వర్ - స్వామిగౌడ్ - శ్రీనివాస్ గౌడ్ - మధుసూదనాచారి - కొండా సురేఖ లాంటివారు అసంతృప్తికి గురయ్యారు. వారిలో స్వామిగౌడ్ కు శాసనమండలి చైర్మెన్ గానూ - మధుసూదనాచారికి అసెంబ్లీ స్పీకర్ గానూ నియమించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ - మరికొందరికి పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమించినా, ఆ తర్వాత హైకోర్టు తీర్పుతో వారి పదవులు పోయాయి. అయితే అదే సమయంలో టీడీపీ నుంచి వచ్చిన తలసారి శ్రీనివాస్ యాదవ్ - తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం విదితమే. రాజయ్యను తప్పించి కడియం శ్రీహరిని మంత్రివర్గంలో తీసుకోవడం చర్చనీయాంశమైంది. కొప్పుల ఈశ్వర్‌కు ప్రభుత్వ చీప్ విప్ గా నియమించినా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు.
మరోవైపు ఇదే సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి - ఎర్రబెల్లి దయాకర్ రావు - రెడ్యానాయక్ - టీఆర్ ఎస్ నేత నిరంజన్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని వారికి కేసీఆర్ హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో నాయిని నర్సింహారెడ్డి - చందూలాల్ - లక్ష్మారెడ్డి- పద్మారావుగౌడ్ - కడియం శ్రీహరి వంటి వారిని తప్పించి కొత్తవారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. విలేకరుల సమావేశం పెట్టినప్పుడల్లా..క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పుడు' నేను ఎప్పుడు చెప్పలేదు..మీరే రాసుకుంటున్నారు' అని చెబుతుండేవారు. అయితే ఉండదు అని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. దీంతో ఆశావహుల్లో ఎప్పటికప్పుడు తాము మంత్రిని అయినట్టేనని ఊహించుకునేవారు. ఒకరిద్దరు అయితే అయినప్పుడు చూద్దాంలే అని తప్పించుకుంటున్నారు.
ఇదే సమయంలో సీనియర్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి - ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ ఎస్ పార్టీలో దుమారం రేపాయి. మంత్రివర్గంలో బయటివారికి చోటు దక్కుతుందని, వారిదే పెత్తనం సాగుతున్నదని మాట్లాడడంతో సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. అయితే, మంత్రివర్గంలో చేరేందుకు ఆశలు పెట్టుకున్న ఆశావహులు మాత్రం తమ కోరికను చంపుకోలేకపోతున్నారు. పునర్ వ్యవస్థీకరణ తప్పకుండా ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు.