Begin typing your search above and press return to search.

ఏపీ భవన్ ను మొత్తంగా ఇచ్చేయమంటున్నారు

By:  Tupaki Desk   |   23 Jun 2016 2:44 PM GMT
ఏపీ భవన్ ను మొత్తంగా ఇచ్చేయమంటున్నారు
X
ఇప్పటికే కృష్ణా జలాల వినియోగం మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలు సరిపోవన్నట్లుగా మరో అంశానికి సంబంధించిన వివాదం తెర మీదకు వచ్చినట్లే. ఢిల్లీలోని ఏపీ భవన్ ను తమదని.. తమకు ఇచ్చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఏపీ భవన్ ను తమకు ఇచ్చేయాలనే అంశానికి సంబంధించి కేసీఆర్ వాదన ఏమిటంటే.. సదరు భవనం తొలుత హైదరాబాదీ నిజాం నవాబు ఆస్తిగా ఉండి.. ఆపై ఏపీ భవన్ గా మారిన ఢిల్లీలోని ఈ కీలక భవన్ ను తమకు ఇచ్చేయాలంటున్నారు.

పదో షెడ్యూల్ లో ఉన్న ఆ భవనాన్ని తమకు ఇవ్వాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసిన ఆయన.. తాము ఆ భవనాన్ని తెలంగాణ భవన్ గా నిర్మించుకుంటామని.. ఇందుకు తగినట్లుగా తమకు ఆ స్థలాన్ని పూర్తిగా అప్పగించాలని ఆయన కోరారు. ‘‘అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలం. అందులో ఏపీకి వాటా ఇవ్వటం సరికాదు. మా స్థలాన్ని మాకిచ్చేస్తే.. అద్భుత రీతిలో తెలంగాణ భవన్ ను నిర్మించుకుంటాం. ఇందుకు కేంద్రం సహకరించాలి’’ అంటూ ఆయన లేఖలో కోరారు.

ఏపీ భవన్ విషయంలో నిజాం నాటి స్థలాల లెక్కలోకి వెళితే.. రాష్ట్ర విభజన కూడా నిజాం కాలం నాటి హైదరాబాద్ స్టేట్ కు తగ్గట్లుగా కోరాలని ఏపీ కోరితే ఎలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 60 ఏళ్లు కలిసి ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం మీద ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లుగా ఉండటం సమంజసమన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ కోరుకున్నట్లుగా ఢిల్లీలోని ఏపీ భవన్ ను అప్పగించిన పక్షంలో.. హైదరాబాద్ స్టేట్ పరిధిలో ఉన్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కింద ఇవ్వాలన్న వాదన తెర మీదకు వస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం ఏపీకి చెందిన కొన్ని ప్రాంతాల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న పంచాయితీలు చాలవన్నట్లు.. తాజా కేసీఆర్ లేఖ మరో కొత్త పంచాయితీకి తెర తీసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేసీఆర్ లేఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.