Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ర‌ద్దుకు కేసీఆర్ నిర్ణ‌యం?

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:50 PM GMT
అసెంబ్లీ ర‌ద్దుకు కేసీఆర్ నిర్ణ‌యం?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత త‌న సార‌థ్యంలోని మంత్రిమండ‌లితో క‌లిసి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారా? ఇందుకోసం ముహుర్తం సిద్ధం చేసుకున్నారా? ఈనెల 25వ తేదీన ఆయ‌న అసెంబ్లీని ర‌ద్దు చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ కీల‌క స‌మావేశంలో ఈనెల 24న రాష్ట్ర కమిటీ - పార్లమెంటరీ పార్టీ - శాసనసభ సమావేశం నిర్వ‌హించనున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే ఈ భేటీ అనంత‌రం రోజే...కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దుకు సిఫార‌సు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా త‌న నివాసంలో మంత్రుల‌తో స‌మావేశ‌మైన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. టీఆర్ ఎస్ ప్రగతి నివేదన సభను సెప్టెంబర్ 2వ తేదీన జరిపేందుకు ఆయ‌న ముహుర్తం పెట్టారు. హైదరాబాద్‌ లోని కొంగర కలాన్ లో సెప్టెంబర్ 2న సాయంత్రం నాలుగు గంటలకు టీఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 25 లక్షల మంది హాజరయ్యే ఈ సభ కోసం గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. దాదాపు 1600 ఎకరాలు స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశామని.. అందులో సభావేదిక - బారికేడ్ లు - పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.ఈ కీల‌క స‌మావేశాని కంటే ముందు ఈనెల 24న రాష్ట్ర కమిటీ - పార్లమెంటరీ పార్టీ - శాసనసభ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో త‌న‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని సీఎం కేసీఆర్ మంత్రుల‌కు సెల‌విచ్చారు.

వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 25వ తేదీన సీఎం కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దుకు ముహుర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని - త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రగనున్న నాలుగు రాష్ర్టాల‌తో క‌లిసి వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాజ‌స్థాన్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్‌ - మిజోరాంతో క‌లిసి గులాబీ ద‌ళ‌ప‌తి ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనున్న‌ట్లు చెప్తున్నారు. ఈ మేర‌కు త‌న‌తో స‌మావేశ‌మైన మంత్రుల‌తో అభిప్రాయ సేక‌రణ చేసిన‌ట్లు పేర్కొంటున్నారు. 25వ తేదీనే ఖ‌చ్చితంగా చేయ‌క‌పోయినా... ఆ స‌మావేశంలో సిగ్న‌ల్స్ ఇస్తార‌ని అంటున్నారు.