Begin typing your search above and press return to search.

అందుకే గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ 2 గంట‌ల చ‌ర్చ‌లు?

By:  Tupaki Desk   |   8 Nov 2018 4:07 AM GMT
అందుకే గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ 2 గంట‌ల చ‌ర్చ‌లు?
X
దేశంలో మ‌రెక్క‌డా క‌నిపించ‌ని సీన్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం త‌ర‌చూ ఆవిష్కృతం కావ‌టం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌ధ్య సంబంధాలు చాలా ప‌రిమితంగా ఉంటాయి. ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో వారు క‌ల‌వ‌టం మామూలే. ఇందుకు భిన్నంగా త‌ర‌చూ క‌ల‌వ‌టం.. మాట్లాడుకోవ‌టం తెలంగాణ‌లోనే క‌నిపిస్తుంటుంది. ముఖ్య‌మంత్రి హోదాలో ఉంటే పాల‌నా ప‌ర‌మైన అంశాల మీద చ‌ర్చించుకోవ‌టానికి అని అనుకోవ‌చ్చు.

ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ కు పాల‌నాప‌ర‌మైన అంశాలు చాలా ప‌రిమితంగా ఉంటాయి. ఇలాంటివేళ కూడా గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ కావ‌టం.. ఆ స‌మావేశం ఏకంగా 2 గంట‌ల పాటు సాగ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రించేందుకు గంట‌ల స‌మ‌యం తీసుకున్న‌ట్లు చెప్పే మాట‌ల‌కు ఏ మాత్రం అత‌క‌ని రీతిలో తాజా మీటింగ్ ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అన్నంత‌నే 40 నిమిషాల నుంచి గంట వ‌ర‌కూ సాగ‌టం కామ‌న్.

కానీ.. అందుకు భిన్నంగా 2 గంట‌ల పాటు సాగ‌టంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేసుకొని వ‌చ్చినంత‌నే గ‌వ‌ర్న‌ర్ తో ఈ సుదీర్ఘ భేటీ వెనుక అస‌లు విష‌యం ఏమిట‌న్న‌ది అంతుచిక్క‌నిదిగా మారింది. గ‌తంలోనూ వీరిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ భేటీలు జ‌రుగుతుండ‌టం కామ‌న్ కావ‌టంతో పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ.. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ తో అంత‌సేపు మాట్లాడ‌టం చాలా అరుదుగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.

ఇంత‌కీ గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ 2 గంట‌ల భేటీ వెనుక అస‌లు కార‌ణం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ల‌భిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కేసీఆర్ తాజా ఢిల్లీ టూర్ ఆయ‌న వ్య‌క్తిగ‌త ప్ర‌యాణం ఎంత మాత్రం కాదంటున్నారు. కంటి.. దంత స‌మ‌స్య‌ల‌తో తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. వాటిని టెస్ట్ చేయించుకోవ‌టం కోస‌మే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

అధికారికంగా అయితే కేసీఆర్ ఆరోగ్య టెస్టుల కోసం ఢిల్లీకి వెళ్లి ఉంటే ఈపాటికి అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యేది. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు కూడా. ఇదిలా ఉంటే.. కేసీఆర్ ఢిల్లీ టూర్ ప‌క్కా ప్లానింగ్ తో చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇటీవ‌ల చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యం.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాత్ర ఉన్న‌ట్లుగా చెప్పే ఓటుకు నోటు కేసుకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపి ఉంటార‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బాబును కానీ ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి వ‌స్తే ఏం చేయాల‌న్న అంశంపై బీజేపీ అధినాయ‌క‌త్వంతో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపి ఉంటార‌ని చెబుతున్నారు.

కేసీఆర్ ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా రానున్న రోజుల్లో ఓటుకు నోటు కేసులో ఏమేం చేయాల‌న్న అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్రం త‌న‌కిచ్చిన యాక్ష‌న్ ప్లాన్ ను కేసీఆర్ అమ‌లు చేసే క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ ఏం చేయాల‌న్న దానిపై ఈ ఇరువురు ప్ర‌ముఖులు సీరియ‌స్ గా చ‌ర్చ‌లు జ‌రిపి ఉంటార‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబును కానీ అరెస్ట్ చేయాల్సి వ‌స్తే.. ఏపీలో రాజ‌కీయ సంక్షోభం చోటు చేసుకుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి సంద‌ర్భాల్లో ప‌రిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలి? అన్న అంశంతో పాటు.. బాబు అరెస్ట్ కానీ అనుకున్న‌ట్లు జ‌రిగితే త‌న‌కు జ‌రిగే రాజ‌కీయ న‌ష్టం.. వ‌చ్చే ఒత్తిళ్ల గురించి డిటైల్డ్ గా మాట్లాడుకొని ఉంటారంటున్నారు. మ‌రి.. ఈ వాద‌న‌లో నిజం ఏమిట‌న్న‌ది మ‌రికొద్ది రోజుల్లో చోటు చేసుకునే ప‌రిణామాల‌తో మ‌రింత క్లారిటీ రావ‌టం ఖాయ‌మంటున్నారు. ఓటుకు నోటు కేసు బాబుకే ప‌రిమితం కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సున్నిత‌మైన అంశంగా మారే ప్ర‌మాదం ఉండ‌టంతో వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ రెండు గంట‌ల పాటు సాగిఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.