Begin typing your search above and press return to search.

భోజనం వెండి పళ్లెంలో.. మంచినీళ్లు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లోనా?

By:  Tupaki Desk   |   26 May 2022 1:30 PM GMT
భోజనం వెండి పళ్లెంలో.. మంచినీళ్లు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లోనా?
X
వారిది కుటుంబం సాదాసీదా కాదు. వారింట్లో ఒకరు దేశ మాజీ ప్రధానమంత్రి అయితే.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన ఘన చరిత్ర ఆ కుటుంబానిది. అవును.. మీ అంచనా సరైనదే. కర్ణాటకకు చెందిన దేవెగౌడ కుటుంబంలోని విలక్షణత మరే రాజకీయనేత కుటుంబంలోనూ కనిపించదు. బీజేపీ.. కాంగ్రెస్ కాకుండా మరే కూటమి కట్టాలన్నా..దేవెగౌడ దర్శనం చేసుకోవాల్సిందే.

ఇప్పుడైతే కర్ణాటకలో వారి కుటుంబానికి పరిమితంగా రాజకీయ పట్టు ఉన్నప్పటికి.. రాజకీయంగా వారి పార్టీకి అవకాశాలు అంతంతమాత్రమే. ఎవరో ఒకరితో జట్టు కడితే తప్పించి సొంతంగా అధికారంలోకి రాలేని పరిస్థితి.

అలాంటి దేవెగౌడ నివాసానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మోడీకి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ తో కలవకుండా జట్టు కట్టటం ద్వారా దేశానికి సరికొత్త మార్గదర్శకుడిగా మారాలన్న ఆయన తలంపు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఆయన ఎంత ప్రయత్నించినా.. ఫలితం మాత్రం అంతంతమాత్రమే అన్న మాట వినిపిస్తోంది. అయినప్పటికీ తన ప్రయత్నాలు ఆపని కేసీఆర్.. దేశ ప్రధానమంత్రి తన రాష్ట్రానికి.. తాను ఉండే హైదరాబాద్ నగరానికి వచ్చిన వేళ.. గులాబీ బాస్ మాత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు మహానగరానికి వెళ్లారు.

ఆయనకు సాదరణ స్వాగతం లభించింది. దేవగౌడ..ఆయన కుమారుడు కు మారస్వామితో భేటీ అయిన కేసీఆర్.. వారింట్లో భోజనం చేశారు. సీఎం కేసీఆర్ గొప్ప గుణం ఏమంటే.. తాను ఎవరింటికి వెళ్లినా.. తన ఇంటికి ముఖ్య అతిధి వచ్చినా.. వారితో భోజనం చేసిన తర్వాతే సమావేశాన్ని ముగిస్తారు. వెళ్లామా..కలిశామా.. మాట్లాడామా..తిరిగి వచ్చామా? అన్నట్లు కాకుండా.. ఒక భేటీ పది మీటింగ్ లతో సమానం అన్నట్లుగా ఆయన తీరు ఉంటుందని చెబుతారు.

దేవగౌడ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చిన సాదర విందుకు సంబంధించిన ఫోటోలు వచ్చాయి. ఈ ఫోటోల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. వెండి కంచాలు.. వెండి స్పూన్లు.. వెండి గిన్నెలతో విందుకు సిద్ధం కావటం ఓకే అయినా.. ఇంత మంచి సీన్ లో దరిద్రపుగొట్టు ప్లాస్టిక్ బాటిళ్లను మంచినీళ్ల కింద ఉంచటం గమనార్హం. రాజకీయంగా తోపులాంటి ఫ్యామిలీల్లో మంచినీళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండవా? అన్న సందేహం కలుగక మానదు. వచ్చిన అతిధులకు సాదాసీదా ప్రజలు సైతం వినియోగించే రూ.7 బాటిళ్లను వాడటం ఏమిటన్న ఆశ్చర్యం కలుగక మానదు.

సాధారణంగా సినీ.. క్రీడా ప్రముఖులు ప్రత్యేకమైన మినరల్ వాటర్ ను వాడతారని చెబుతారు. ఆ నీళ్లు లీటరు వెయ్యి నుంచి రూ.4వేల వరకు ఖరీదు ఉంటాయని చెబుతారు. మరి.. వయసులో పెద్దలు.. రాజకీయంగా విశేష అనుభవంతో పాటు.. అధికారం మొత్తం తమ గుప్పిట్లో ఉంచుకొని కోట్లాది మంది ఏలే కేసీఆర్ లాంటి పెద్ద మనిషి.. దేశాన్ని ఏలిన దేవగౌడ లాంటి ప్రముఖులు సాదాసీదా ప్రజలు వాడే మామూలు వాటర్ బాటిల్ నీళ్లు తాగటమేంది చెప్మా?