Begin typing your search above and press return to search.

బాబు ఎత్తుకు కేసీఆర్ పై ఎత్తు

By:  Tupaki Desk   |   24 Oct 2015 5:00 PM GMT
బాబు ఎత్తుకు కేసీఆర్ పై ఎత్తు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాజ‌కీయ చాణ‌క్య‌త‌ను మ‌రోమారు నిరూపించుకుంటున్నారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ ను అభివృద్ధి ప‌థంలోకి న‌డిపించేందుకు ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ముందే ప‌సిగ‌డుతున్న కేసీఆర్ ఆ క్ర‌మంలో త‌న ఎత్తుల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల విసిరిన కేసీఆర్...ఇపుడు ఆ ఎత్తును సినీ రంగానికి మ‌రలించిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న సినిమా పరిశ్ర‌మ విస్త‌రించేందుకు ఆ రంగంలోని ప‌లువురు పెద్ద‌లు ఆలోచ‌న చేస్తున్నారు. ఈ క్రమంలో హైద‌రాబాద్‌లోనే త‌మ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు చేప‌ట్టాలా లేక‌... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి త‌ర‌లివెళ్లాలా అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. గ‌తంలో ఇలాంటి చ‌ర్చ‌లు జ‌రిగిన‌పుడు హైద‌రాబాద్ స‌మీపంలోని రాచ‌కొండ గుట్ట‌ల్లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌ సిటీని నిర్మించేందుకు కేసీఆర్ సిద్ధ‌ప‌డ్డారు. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల ఆ ప్ర‌క్రియ ఆగిపోయింది. మ‌రోవైపు ఏపీకి కొత్త శోభ తెచ్చేందుకు ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వైజాగ్‌లోని బీచ్ రోడ్ స‌మీపంలో సినీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యం గ్ర‌హించిన కేసీఆర్ తాజాగా రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

సినీదిగ్గ‌జం - న‌ట‌శేఖ‌ర కృష్ణ‌తో సీఎం కేసీఆర్ త‌న‌ క్యాంప్ ఆఫీస్‌లో ఇటీవ‌లే స‌మావేశం అయ్యారు. త‌న కుటుంబంలో జ‌రిగే ఓ శుభ‌కార్యానికి రావాల్సిందిగా కృష్ణ తెలంగాణ సీఎంను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌-కేసీఆర్‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. సినీరంగం విస్త‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌ను వేదిక‌గా ఎంచుకోవాల‌ని ఇందుకు త‌న‌వంతు స‌హాయం అందిస్తాన‌ని కేసీఆర్ చెప్పారు. దానికి కృష్ణ‌ స‌మ్మ‌తించినట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చేనెల‌లో కృష్ణ నివాసానికి ప్ర‌త్యేకంగా వ‌స్తాన‌ని కేసీఆర్ ప్ర‌తిపాదించగా...దానికి కృష్ణ ఓకే అన్నారు. కృష్ణ నివాసంలో జ‌ర‌గ‌బోయే ఈ స‌మావేశంలో ఆయ‌న‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు అగ్ర‌శ్రేణి నిర్మాతలు, ద‌ర్శ‌కులు కూడా పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఈ స‌మావేశంలో ఫిల్మ్‌ సిటీ నిర్మాణాన్ని కూడా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

సినీ ప‌రిశ్ర‌మ‌కు ఉన్న గ్లామ‌ర్‌, ఆ రంగం క‌ల్పించే ఉపాధి అవ‌కాశాలు, వీట‌న్నింటితో పాటు హైద‌రాబాద్‌కు వ‌చ్చే ఆదాయ వ్య‌యాల‌ను లెక్కించుకొని కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.