Begin typing your search above and press return to search.

విపక్ష నేతలతో కేసీఆర్ లంచ్

By:  Tupaki Desk   |   30 April 2016 1:53 PM GMT
విపక్ష నేతలతో కేసీఆర్ లంచ్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు కాస్త భిన్నమన్న విషయం తెలిసిందే. సగటుజీవి కోరికను ఇట్టే తీర్చటమే కాదు.. మా ఇంటికి రారా సీఎం సారూ అని అభిమానంగా అడిగితే.. వారు ఊహించనంత ఫాస్ట్ గా రియాక్ట్ అయి వారింటికి వెళ్లి కులాసాగా కబుర్లు చెప్పి రావటం కేసీఆర్ కు అలవాటే. అదే వ్యక్తి.. తనను కలవాలని టైం అడిగే విపక్ష నేతల్ని కలిసేందుకు సైతం ససేమిరా అనటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది.

తోటి రాజకీయ పార్టీ నేతలు కలుద్దామని అంటున్నారు కదా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తాను కాస్త వీలు చేసుకొని టైం ఇచ్చే విషయంలో చాలా కరుకుగా వ్యవహరించటం కూడా ఆయనకు మాత్రమే సాధ్యం. మరి.. అలాంటి కేసీఆర్ అనుకోని విధంగా విపక్ష నేతల్ని కలిస్తే ఎలా స్పందిస్తారంటే తాజాగా జరిగిన ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే. తాజాగా ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కుమార్తె పెళ్లి జరిగింది.

ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఈటెల రాజేందర్ తోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. హైదరాబాద్ లోనే పెళ్లి జరగటంతో కార్యక్రమానికి హాజరైన నేతలు సంఖ్య కాస్త ఎక్కువే. అధికారపక్ష నేతలతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి.. షబ్బీర్ అలీ.. వివేక్ తదితరులు కూడా పెళ్లికి హాజరయ్యారు. పఅయింట్ మెంట్ ఇచ్చే విషయంలో కరుకుగా వ్యవహరించే కేసీఆర్.. అనుకోకుండా కలిసిన విపక్ష నేతలతో అప్యాయంగా మాట్లాడటమే కాదు.. ఒకే టేబుల్ మీద విందు కానిచ్చేశారు. ఓపక్క ఉప ఎన్నికల వేడి జోరుగా ఉన్న వేళ.. ముఖ్యమత్రి.. ప్రధాన ప్రతిపక్ష నేత ఇద్దరూ కలిసి కూర్చొని ఒకే టేబుల్ మీద భోజనం చేయటం పలువురిని ఆకర్షించింది.