Begin typing your search above and press return to search.

హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కీలక వ్యాఖ్య చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   13 Feb 2022 9:33 AM GMT
హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కీలక వ్యాఖ్య చేసిన కేసీఆర్
X
ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేయటం.. అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పనలవి కాదు. ఆచరణ అసాధ్యమని భావించే నిర్ణయాల్ని అలవోకగా తీసుకుంటారు. చాలా సింఫుల్ అన్న వాటిని అస్సలు పట్టించుకోరు.

ఇలా.. తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో వ్యవహరించే సీఎం కేసీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన ఒక మాట వింటే.. హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని త్వరలో మార్చాలనుకున్న ఎజెండాకు ఆయన సిద్ధమవుతున్నారా? అన్న భావనకు గురి కాక మానదు.

ఇప్పటివరకు హైదరాబాద్ మహానగరాన్ని మొత్తంగా మార్చేందుకు వీలుగా ఆయన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారా? అన్న సందేహం కలిగేలా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. నల్గొండ ప్రజా ప్రతినిధులు.. ఉద్యోగులతో కేసీఆర్ నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో హైదరాబాద్ - వరంగల్ కారిడార్ దేశంలోనే గొప్పగా వెలుగొందుతుందని.. యాదాద్రి ఆలయం పూర్తి అయితే హైదరాబాద్.. భువనగిరి జిల్లా కలిసిపోతాయని చెప్పారు. ఒకప్పుడు భువనగిరి.. ఆలేరు.. తుర్కపల్లి ప్రాంతాల్లో ఎకరం రూ.మూడు లక్షలు ఉండేదని.. ఇప్పుడు ఏ మూల చూసినా రూ.20-30 లక్షలకు తక్కువ లేదన్నారు.

కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే.. యాదాద్రి ఆలయం వచ్చే నెల చివర్లో మొదలు కానుంది. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన దానికి తగ్గట్లే.. ఇప్పటికే రీజనల్ రింగు రోడ్డు పేరుతో భారీ ఎత్తున రింగు రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే మహానగరిగా ఉన్న హైదరాబాద్ లోకి యాదాద్రిని తీసుకురావటం ద్వారా.. హైదరాబాద్ ను మరింత మెగాసిటీగా మార్చే ప్రణాళికలు సీఎం కేసీఆర్ మదిలో పుష్కలంగా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది.

హైదరాబాద్ మహానగర పరిధిని మరింత పెంచటం ద్వారా.. యాదాద్రి వరకు భూముల ధరలు మరింత భారీగా పెరిగిపోవటం ఖాయం. మొత్తంగా హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే పనిలో కేసీఆర్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారన్న వైనం తాజా వ్యాఖ్యతో అర్థమైనట్లే.