Begin typing your search above and press return to search.

తెలంగాణ కంటే ముందు ఏపీకి అధ్యక్షుడు.. కేసీఆర్ అసలు ప్లాన్ ఏంటి..?

By:  Tupaki Desk   |   4 Jan 2023 6:56 AM GMT
తెలంగాణ కంటే ముందు ఏపీకి అధ్యక్షుడు.. కేసీఆర్ అసలు ప్లాన్ ఏంటి..?
X
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. ఈ సామెతను బాగా నమ్మిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇంట గెలిచిన కేసీఆర్.. ఇప్పుడు రచ్చ గెలిచేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్క రాష్ట్రం ఆంధ్రాకు అధ్యక్షుడిని నియమించారు.కర్ణాటక, బీహార్, తదితర రాష్ట్రాల్లో కమిటీలు వేసేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ పురిటిగడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు..? అనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్న అంశం. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన తరువాత తెలంగాణకు బాస్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా తెలంగాణ ను కాదని ఏపీకి ముందే అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఏముంది..? అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి..?

బీఆర్ఎస్ లో ఇటీవల ఏపీ నాయకులు చేరిన సందర్భంగా కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు స్పీడ్ పెంచుతామన్నారు. ఇప్పటికే ఏపీకి అధ్యక్షుడిని నియమించిన ఆయన మిగతా రాష్ట్రాల్లోనూ కమిటీలు వేస్తామన్నారు. కానీ తెలంగాణకు అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించలేదు. తెలంగాణకు తానే అధ్యక్షుడిగా కొనసాగుతారా..? లేదా కేటీఆర్ ను నియమిస్తారా..? అనేది బీఆర్ఎస్ నాయకుల్లోనూ ఉత్కంఠంగా మారింది.

బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి కేటీఆర్ కనిపించడం లేదు. ఇటీవల ఏపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. అయితే కొందరు ఇదే విషయాన్ని అడగగా జపాన్ వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చినందున హాజరు కాలేకపోయానని అన్నారు. కానీ నిజంగానే కేటీఆర్ అంత కమిట్మెంట్ ఇచ్చాడా..? అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ ను విస్తరించేందకు నిద్రాహారాలు మాని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ కు ఆయన కుమారుడు కేటీఆర్ తోడుండాల్సిన విషయం. అంతేకాకుండా బీఆర్ఎస్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రచారం చేయాల్సిన అంశం. కానీ దానిపై కేటీఆర్ స్పందన కనీసం కూడా లేదు. దీంతో ట్విట్టర్ ఫాలోవర్స్ సైతం అయోమయంగా ఉన్నారు. కేటీఆర్ మాత్రమే కాకుండా ఎమ్మెల్సీ కవిత కూడా ఏపీ నాయకులు చేరే కార్యక్రమంలో పాల్గొనలేదు.

గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు తాను కూడా పాల్గొన్నానని ఇటీవల కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పాత ఫొటోలను పెట్టారు. ఆంధ్రా పాలకులపై పలు కామెంట్లు చేసి యూత్ లో జోష్ పెంచారు. ఇలాంటి తరుణంలో ఆంధ్రా నేతలు స్వయంగా తెలంగాణకు వచ్చిన బీఆర్ఎస్ లో చేరడం ఒక వర్గానికి నచ్చడం లేదు. అందులోనూ కేటీఆర్ కు అస్సలు మనసొప్పడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రాజకీయ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రత్యేక రాష్టం ఏర్పడిన తరువాత బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు ఆయనను గెలిపిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తామని కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు.

ఈ సమయంలో కేటీఆర్ బీఆర్ఎస్ లో చేరికల కార్యక్రమంలో పాల్గొంటే అనేక విమర్శలు వస్తాయని ఊహించారు. కేసీఆర్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టే సత్తా ఉంది. మరోవైపు ఒకవేళ బీఆర్ఎస్ అటూ ఇటూ అయినా కేసీఆర్ కు పెద్దగా నష్టం లేదు. కానీ ఎంతో భవిష్యత్ ఉన్న కేటీఆర్ ఈ చిక్కులో పడితే తట్టుకోవడం కష్టమని భావించినట్లు తెలుస్తోంది. అందుకే కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే కేసీఆర్, కేటీఆర్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని అంటున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఏమాత్రం ఇష్టం లేదని, అంతేకాకుండా బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండేందుకు కేటీఆర్ రెడీగా లేడని అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ ను కాదని తానే అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే ప్రజల్లో బ్యాడ్ ఒపినీయన్ వస్తుంది. అంతేకాకుండా జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించాలనేది సమస్యగా మారుతుంది.

ఇక బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఇప్పటికిప్పుడు వేరొకరి ఇచ్చినా పార్టీ చేజారిపోతుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్న కేసీఆర్ ఇంట్లో పోరు తగ్గాక బీఆర్ఎస్ అధ్యక్షుడి ప్రకటన చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే కొందరు ఆంధ్రా నాయకులు తమ స్వప్రయోజనాల కోసం బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిని కేసీఆర్ కూడా ఆహ్వానించడంతో పాటు పార్టీ ఏపీ బాధ్యతలను వారి చేతిలో పెట్టారు. మిగతా రాష్ట్రాల్లో సరైన నాయకుడు దొరికితే అక్కడా నియమించే ఛాన్స్ ఉంది. కానీ తెలంగాణకు అధ్యక్షుడు ఎవరనేది ఇంకెన్ని రోజులు సస్పెన్స్ గా ఉంటుందో తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.