Begin typing your search above and press return to search.

ఉత్తమ్, ఆయన భార్యకు షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Sep 2018 4:39 AM GMT
ఉత్తమ్, ఆయన భార్యకు షాకిచ్చిన కేసీఆర్
X
అవి 2014 ఎన్నికలు.. ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసిన కేసీఆర్.. దక్షిణ తెలంగాణలో మాత్రం తేలిపోయారు. కేసీఆర్ సర్కారు ఏర్పడడానికి కావాల్సిన సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే వచ్చాయి. నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ గాలి వీచింది. ఇక్కడ ఒక్క స్థానంలోనే టీఆర్ ఎస్ గెలిచింది. అప్పటి నుంచి కేసీఆర్ నల్గొండపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దిగ్గజాలైన కోమటిరెడ్డి బ్రదర్స్ - ఉత్తమ్ ఫ్యామిలీ - జానారెడ్డి - తదితర కాంగ్రెస్ ఉద్దండులను ఓడించేందుకు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో బలమైన నేతలు టీఆర్ఎస్ కు అక్కడ లభించడం లేదు. ఉన్నవాళ్లు అంతంత మాత్రం వాళ్లే కావడంతో కేసీఆర్ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ నిన్న అసెంబ్లీ రద్దు చేసి ఆశ్చర్యపరిచారు. అంతేకాదు.. ఏకంగా 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక్క లేఖతో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మజ్లిస్ 7 సీట్లు పోగా.. కొన్ని సందేహాస్పద సీట్లను వదిలేశారు. కేసీఆర్ ప్రకటించిన 105 సీట్లను వదిలేస్తే.. మిగిలిన 14 సీట్లలో 7 మజ్లిస్ పక్కా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిగిలిన 7 సీట్లలో రెండు అత్యంత హాట్ సీట్లు.. అవే ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఆయన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ - కోదాడ నియోజకవర్గాలు..

ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పోయిన సారి తెలంగాణ ఉద్యమ కారుడు శ్రీకాంతాచారి తల్లిని ఉత్తమ్ పై టీఆర్ ఎస్ తరఫున నిలబెట్టారు.. ఆమె గెలవలేకపోయింది. ఈసారి అంతకంటే బలమైన నేతకు టిక్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయనపై అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక ఆయన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడకు కూడా కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది..

ఇలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ - ఆయన భార్యకు షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఉత్తమ్ ను ఓడిస్తే తెలంగాణ కాంగ్రెస్ కు ఘోర అవమానమని.. ఆ పార్టీ కుదేలవుతుందని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. బలమైన అభ్యర్థులను వీరిపై దింపి ఓడించేందుకు ప్లాన్ చేశారు. మరి ఈ ప్లాన్ కు ఉత్తమ్ ఎలాంటి ప్లాన్లు వేస్తారు.? లేదా చిత్తయిపోతారా.? అసలు వీరిపై పోటీచేసే ఆ బలమైన అభ్యర్థులు ఎవరనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.