Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌.. త్వ‌ర‌లో ప్రాంతీయ పార్టీల‌తో భారీ స‌భ‌

By:  Tupaki Desk   |   15 Jan 2022 7:28 AM GMT
కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌.. త్వ‌ర‌లో ప్రాంతీయ పార్టీల‌తో భారీ స‌భ‌
X
కేంద్రంలోని బీజేపీని గ‌ద్దె దింపుతానంటూ.. త‌ర‌చుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఆదిశ‌గా వేగంగా పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో ఆయ‌న ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఉత్త‌రాదిలో బీజేపీని వ్య‌తిరేకించే ఆర్జేడీ, క‌మ్యూనిస్టులు త‌దిత‌ర నేత‌ల‌తో ఇటీవ‌ల కాలంలో భేటీ అయి చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో భారీ వ్యూహానికి కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్టు తెలిసింది.

జాతీయస్థాయిలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పేందుకు హైదరాబాద్‌ వేదికగా సదస్సు నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు కాకుండా.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం.. బీజేపీ ప‌రిస్థితిని అంచ‌నా వేసి.. అప్పుడు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్ర‌స్తుతం .. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల నేత‌లు తీరిక లేకుండా ఉన్నారు. ఈ క్ర‌మంలో వారిని ఇప్ప‌టికి వ‌దిలేసి.. ఎన్నిక‌ల అనంత‌రం.. ప‌రిస్థితిని అంచ‌నా వేసి.. అన్ని ప్రాంతీయ పార్టీల‌నూ ఏక‌తాటిపైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీనికిగాను.. మార్చిలో జరుగనున్న యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవాన్ని కేసీఆర్ వేదిక‌గా మార్చుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఆ సందర్భంగా సమావేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉత్త‌ర‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి వ్య‌తిరేకంగా.. ఎస్పీ పార్టీ త‌ర‌ఫున కేసీఆర్ ప్ర‌చారం చేయ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. నిజంగా బీజేపీ ఇరుకున ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అదేస‌మ‌యంలో కేసీఆర్ జాతీయ‌స్థాయిలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకోవ‌డం సాధ్య‌మేన‌ని అంటున్నారు.

అఖిలేష్ నేతృత్వ‌లోని సమాజ్ వాదీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇటీవల ట్విట్టర్‌లో నిర్వహించిన `ఆస్క్ కేటీఆర్‌`లో మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. సంప్రదింపుల తర్వాత అక్కడ వారికి మద్దతుగా ప్రచారం చేయడంపై స్పందిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌గానీ, టీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం కానీ అఖిలేష్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ ఆ భేటీలో ఖరారు కానుంది. యూపీలో పలు చోట్ల తెలుగువాళ్లకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు ఉన్న నేప‌థ్యంలో వీరి ప్ర‌చారం ఎస్పీకి క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు. అనంత‌రం.. ప్రాంతీయ పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తార‌ని స‌మ‌చారం. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.