Begin typing your search above and press return to search.

కేసీఆర్ సభ.. 70 ఎకరాల్లో ఏర్పాట్లు.. వేసిన కుర్చీలే భారీగా ఉన్నాయిగా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 4:39 AM GMT
కేసీఆర్ సభ.. 70 ఎకరాల్లో ఏర్పాట్లు.. వేసిన కుర్చీలే భారీగా ఉన్నాయిగా?
X
ఏం చేసినా..ఎలా చేసినా భారీతనం మిస్ కాకుండా ఉండే విషయంలో అస్సలు తగ్గని తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఏం చేసినా తన మార్క్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక.. ఆయన ఒక కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తే.. ఇక ఏర్పాట్లు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా ఉంటాయని చెబుతారు. తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేయటమే కాదు.. నిన్నటివరకు ఉన్న ప్రాంతీయ పార్టీని.. జాతీయ పార్టీగా మార్చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

బీఆర్ఎస్ పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ పార్టీకి సంబంధించినే ఆవిర్భావ సభను ఖమ్మం వేదికగా చేసుకొని నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం గడిచిన కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయటం ద్వారా తన సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు.. చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాది మందిని తరలించే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు.

ఈ భారీ బహిరంగ సభకు మూడురాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు కూడా హాజరు కానున్న విషయం తెలిసిందే. ఇక.. సభకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తే.. అడుగడుగునా కేసీఆర్ మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఈ సభ కోసం 70 ఎకరాల్లో ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. రోజుల తరబడి పలువురు మంత్రులు.. ఇతర బీఆర్ఎస్ నేతలు పగలు.. రాత్రి అనకుండా కష్టపడినట్లుగా చెబుతున్నారు.

ఈ భారీ బహిరంగ సభ కోసం ఏకంగా 70 వేల కుర్చీల్ని ఏర్పాటు చేయటం చూస్తే.. ఈ సభకు తక్కవలో తక్కువ మూడు లక్షల మంది హాజరయ్యేట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఎంత తక్కువగా చూసుకున్నా రెండు లక్షల మందికి ఏ మాత్రం తగ్గని రీతిలో సభ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. సభకు వచ్చే వారికి మజ్జిగ.. మంచినీళ్లకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకోవాలన్న ఆదేశాల్ని సీఎం కేసీఆర్ జారీ చేసినట్లు చెబుతున్నారు.

గ్యాలరీల్లో కార్యకర్తల అవసరాలు తీర్చేందుకు ఏకంగా వెయ్యి మంది వాలంటీర్లను కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఖమ్మం నగరం చుట్టూ ఐదుకిలోమీటర్ల విస్తీర్ణంలో పార్టీ తోరణాలు.. భారీ కటౌట్లు.. హోర్డింగులు.. ఫ్లెక్సీలతో ఖమ్మం నగరం ముస్తాబైన పరిస్థితి. భారీ తనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సీఎం కేసీఆర్.. ఖమ్మం సభతో తన మార్కును యావత్ దేశానికి అర్థమయ్యేలా చేస్తున్నారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.