Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ వ్యూహంలో భాగంగా దీదీ భేటీకి డుమ్మా..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 5:31 AM GMT
గులాబీ బాస్ వ్యూహంలో భాగంగా దీదీ భేటీకి డుమ్మా..!
X
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న సామెతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మర్చిపోయారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని.. చక్రం తిప్పాలని తెగ తాపత్రయపడుతున్న ఆయన.. అందుకు తగ్గట్లుగా భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అటు ఫాం హౌస్.. ఇటు ప్రగతిభవన్ లో రోజుల కొద్దీ భేటీలు నిర్వహిస్తున్నారు. జాతీయ రాజకీయాల ఎంట్రీకి పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం కానప్పటికీ.. అసలేం చేయాలన్న దానిపై మాత్రం ఒక అవగాహనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అధికార బీజేపీకి ధీటుగా అభ్యర్థిని ఎంపిక చేసే అంశాన్ని చర్చించేందుకు.. దానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధాని ఢిల్లీలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న 19 పార్టీలకు ఆహ్వానం పలికారు మమతా.

ఈ పందొమ్మిది మందిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరు. దీదీ ఏర్పాటు చేసిన భేటీకి హాజరు కావాలా? వద్దా? అన్న అంశంపై కొద్ది రోజులుగా సమాలోచనలు చేస్తున్న కేసీఆర్.. మంగళవారం అర్థరాత్రి వరకు ఇదే అంశంపై ఫోకస్ చేశారు. దీనిపై పార్టీకి చెందిన పలువురుసీనియర్ నేతలతో చర్చించారు. కొన్ని సందేహాల నడుమ మాజీ ఎంపీ.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను కరీంనగర్ నుంచి మరీ ప్రగతిభవన్ కు పిలిపించుకొని మరీ చర్చలు జరిపారు.

చివరకు దీదీ భేటీకి తాను కానీ.. తమ పార్టీ తరఫు కానీ ఎవరూ హాజరు కాకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ రోజు నిర్వహించే సమావేశం ప్రాథమికమైనదని.. అందుకే భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భేటీకి కాంగ్రెస్ వస్తున్న నేపథ్యంలో.. భేటీకి వెళ్లకపోవటమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకదశలో తాను హాజరు కాకున్నా.. తమ పార్టీ తరఫున కేకే.. బోయినపల్లి వినోద్ కుమార్ టీంను పంపాలని భావించినా.. అది కూడా సరైన వ్యూహం కాదనే ఆలోచనలో ఆగినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ బలహీనత.. ప్రతిపక్షాల మధ్య అనైక్యత కారణంగా మోడీ పరివారానికి లాభం చేకూరుతుందన్న అంశంపై నిశ్చితమైన అభిప్రాయం ఉన్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో జరిగే ఏ కార్యక్రమానికైనా తొందరపాటుతో వెళ్లటం తర్వాతి రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఆలోచనలు ఇలా ఉంటే.. దీదీ భేటీకి డుమ్మా కొట్టటం ద్వారా.. కాంగ్రెస్.. బీజేపీయేతర పార్టీల్ని కూడగొట్టాలన్న కేసీఆర్ ఆలోచన ప్రాథమికస్థాయిలో దెబ్బ తిన్నట్లు కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

దీదీ నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండటం ద్వారా ఆమెను కేసీఆర్ దూరం చేసుకున్నట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవసరానికి మాత్రమే బయటకు రావటం.. అంతవరకు లోపలే ఉండిపోవటం రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో వర్కువుట్ కావొచ్చు కానీ.. జాతీయ స్థాయిలో మాత్రం అలాంటి ఎత్తుగడ వల్ల ఎలాంటి లాభం ఉండదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.