Begin typing your search above and press return to search.

గవర్నర్ తో 4 గంటల ముచ్చట్లేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   2 Oct 2015 3:28 PM GMT
గవర్నర్ తో 4 గంటల ముచ్చట్లేంది కేసీఆర్?
X
తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి విచిత్రంగా ఉంటుంది. తనను కలవటానికి ఎవరైనా వస్తే గంటల తరబడి నిలబెట్టేస్తారు. ఆయనకు కానీ నచ్చని వ్యక్తులు.. ఆయన్ను విమర్శించే వారు వస్తే.. వారిని కలవటానికి కూడా అస్సలు ఇష్టపడరు. అదే సమయంలో తాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావించే భారీ సౌధానికి సంబంధించిన అభిప్రాయాన్ని తన అటెండర్ ఆలోచన కూడా అడిగి తెలుసుకుంటారు.

తనను వ్యతిరేకించే వారి నీడను కూడా ఇష్టపడని కేసీఆర్.. తనను అభిమానించి.. తనకు మద్ధతుగా నిలిచే వారు ఎవరైనా సరే.. నెత్తిన పెట్టుకున్నట్లే వ్యవహరిస్తుంటారు. ఆయనలో ఇదో పార్శం అయితే.. గవర్నర్ మొదలు.. అధికారుల వరకూ ఎవరితోనైనా గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టుకోవటం ఆయనకు అలవాటే. ఆయన రివ్యూ మీటింగ్ పెడితే.. కనీసం నాలుగైదు గంటలు గడిచిపోతాయి. మర్యాదపూర్వకంగా గవర్నర్ ను కలిసినట్లుగా సింగిల్ లైన్ స్టేట్ మెంట్ ఇచ్చేస్తూనే.. గంటల తరబడి మాట్లాడుతూ ఉండటం మరో విశేషంగా చెప్పాలి.

తాజాగా గవర్నర్ నరసింహన్ ను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపు 4 గంటలకు పైనే చర్చలు జరిపారు. అంత సేపు ఏ అంశాల మీద మాట్లాడుకున్నారంటే.. ఒక్క విషయం కూడా బయటకు రాదు. కాకుంటే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు గురించి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి.. చేపట్టబోయే పథకాలకు సంబంధించిన సమాచారంతో పాటు.. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు .. ఆ విషయాల్ని కూడా గవర్నర్ తో షేర్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

నిజంగా ఇన్ని విషయాల గురించి గవర్నర్ తో చర్చలు జరుపుతారా? అన్నది ఒక ప్రాధమిక ప్రశ్న. మంచి మాటకారి అయినా కేసీఆర్.. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడే లక్షణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ తనకు తానే ఎక్కువ సేపు మాట్లాడుతున్నారా? అన్న సందేహం కలగొచ్చు. నిజానికి గవర్నర్ పెత్తనాన్ని కేసీఆర్ సహిస్తారా? అన్నది ప్రశ్నే. ఎందుకంటే.. వినయంగా వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గవర్నర్ తో ఉన్న విభేదాలతో ఈ మధ్య కాలంలో మాట్లాడటమే జరగలేదు.

ఏపీ ముఖ్యమంత్రికి లేని మర్యాదకర భేటీలు తెలంగాణ ముఖ్యమంత్రికే ఎందుకు ఉంటున్నాయన్నది అసలు ప్రశ్న. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు తెరపైకి వచ్చిన తర్వాత నుంచి గవర్నర్ తో సంబంధాల్ని చంద్రబాబు దాదాపుగా తెంచేసుకున్నట్లు చెబుతారు. ఇందులో వాస్తవం ఎంతన్నది చెప్పలేకున్నా.. ఆయన తీరు చూస్తే మాత్రం ఆ మాట నిజం అనిపించక మానదు.

వారానికి ఒకసారి హైదరాబాద్ వచ్చే చంద్రబాబు.. ఈ మధ్య అది కూడా బంద్ చేసినట్లు కనిపిస్తోంది. బాబు వైఖరిని చూస్తే.. ఒక ముఖ్యమంత్రి.. ఒక గవర్నర్ ను తరచూ కలుసుకోవాల్సిన అవసరమే లేదు. మరి.. అలాంటిది గురువారం రెండున్నర గంటలు గవర్నర్ తో మాట్లాడిన ముఖ్యమంత్రి శుక్రవారం ఏకంగా నాలుగు గంటలు చర్చలు జరిపిన వైనం చూసినప్పుడు.. మర్యాదకర భేటీ అనే కంటే.. వ్యూహాత్మక చర్చలే అన్న అభిప్రాయం కలుగుతోంది. మంత్రి వర్గంలో మార్పుల గురించి ఐదు నిమిషాల్లో తేల్చేసే అంశం. అంతకు మించి దానికి పెద్ద సమయం కూడా పట్టదు. కానీ.. ముందు రోజు రెండున్నర గంటలు.. తర్వాతి రోజు నాలుగు గంటల పాటు చర్చలు జరపటం సింఫుల్ గా తేల్చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ.. గవర్నర్ తో కేసీఆర్ ఏం మాట్లాడి ఉంటారు..?