Begin typing your search above and press return to search.

జార్ఖండ్ సీఎంతో ఏం మాట్లాడింది చెప్పిన కేసీఆర్.. తమదే ఫ్రంట్ అన్నది చెప్పలేదు

By:  Tupaki Desk   |   4 March 2022 2:30 PM GMT
జార్ఖండ్ సీఎంతో ఏం మాట్లాడింది చెప్పిన కేసీఆర్.. తమదే ఫ్రంట్ అన్నది చెప్పలేదు
X
కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు ప్లానింగ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై పలువురితో భేటీ అయ్యేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఒక రోజు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో.. రెండో రోజు సుబ్రమణ్య స్వామి.. రైతు నేత తికాయత్ తో భేటీ అయిన ఆయన.. మూడో రోజున జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు.

బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్న ఆయన.. జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రేసేతర కూటమిని ఒక తాటి మీదకు తెచ్చేందుకు కంకణం కట్టుకున్న ఆయన.. ఆ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసే ప్రయత్నంలో మరో అడుగు వేశారు. జార్ఖండ్ సీఎంతో భేటీ అయిన ఆయన.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. హేమంత్ తో మాట్లాడిన విషయాల్ని క్లుప్తంగా చెప్పిన కేసీఆర్ నోటి నుంచి కొంత ఆసక్తికర సమాచారం వచ్చింది.

జాతీయ రాజకీయాలపై చర్చించామని.. త్వరలోనే మరికొందరు నేతల్ని కలుస్తామని చెప్పిన ఆయన.. దేశంలో మరింత మెరుగైన డెవలప్ మెంట్ జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదన్న ఆయన అదే సమయంలో అనుకూలం కూడా కాదన్నారు. దేశ హితం కోసమే తమ ప్రణాళిక అన్న ఆయన.. తాము ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ గురించి మాత్రం తర్వాత చెబుతామన్నారు.

గురువారం.. జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఒకే వ్యవసాయ విధానం ఉండాలన్న రీతిలో రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్ తో భేటీ అయిన కేసీఆర్.. ఈ రోజున జార్ఖండ్ ముఖ్యమంత్రితో భేటీ కావటం ద్వారా.. తాను చెప్పినట్లే కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయాన్ని చెప్పేశారు. అదే సమయంలో గతంలో మాదిరి ప్రధాని మోడీ మీద విరుచుకుపడకుండా ఆచితూచి మాట్లాడే అలవాటు ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి.