Begin typing your search above and press return to search.

దక్షిణాది నేతగా ఎదిగే క్రమంలో కేసీఆర్!

By:  Tupaki Desk   |   29 April 2018 10:13 AM GMT
దక్షిణాది నేతగా ఎదిగే క్రమంలో కేసీఆర్!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటుచేసి.. కాంగ్రెస్ - భాజపాలకు వ్యతిరేకంగా అధికారంలోకి తీసుకువస్తానని - రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలాగా ఫెడరల్ ప్రజాస్వామ్యవ్యవస్థను పరిపుష్టం చేస్తానని అంటూ కొన్నాళ్లుగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన గతంలో ఓ మారు ఢిల్లీ - కోల్ కత కూడా వెళ్లారు. పలువురు ఉత్తరాది పార్టీల నాయకులను కూడా కలిశారు. ఆ ప్రయత్నాలు ఎంత మేరకు ఆశాజనకంగా నడుస్తున్నాయో మనకు తెలియదు గానీ.. తాజా పరిణామాలను గమనించినప్పుడు.. ఆయన దక్షిణ భారత రాష్ట్రాలకు సమైక్య నాయకుడిగా ఎదిగే క్రమంలో ఉన్నారని మాత్రం అర్థమవుతోంది.

తాజాగా కేసీఆర్ తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి తన జాతీయ రాజకీయాల బృందం సహా వెళ్లి.. డీఎంకే అధినేత కరుణానిధి - ఆయన కుమారుడు ప్రస్తుతం పార్టీ సారథ్య బాధ్యతలు చూస్తున్న స్టాలిన్ లతో భేటీ అయ్యారు. దక్షిణాదిలో కర్నాటక - తమిళనాడులు ప్రస్తుతానికి పెద్ద మరియు కీలక రాష్ట్రాలు కాగా.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ భేటీ అవుతుండడం విశేషం. తాను రూపుదిద్దుతున్న ఫెడరల్ ఫ్రంట్ కు దన్నుగా నిలిచి, ఆ ఫ్రంట్ లో భాగస్వామి కావాలంటూ ఆయన ఉదయించే సూర్యుడి గుర్తు గల డీఎంకే పార్టీని కోరబోతున్నారనేది స్పష్టం. అయితే దీనికి కరుణానిధి పార్టీ ఎలా స్పందిస్తుందనే విషయంలో మాత్రం పలు సందేహాలు ఉన్నాయి.

నిజానికి కేసీఆర్ ప్రతిపాదనకు ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా ఒప్పుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఆయన చెబుతున్న మాటల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా కేంద్రంలో మారితే గనుక.. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు వస్తాయనేది స్పష్టం. అలాంటి పోకడకు ప్రాంతీయ పార్టీలు జైకొడతాయి. కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ లో భాగంగా ఉన్న డీఎంకే ఇటీవల మమతా బెనర్జీ ఏర్పాటుచేసే మూడో కూటమిలో చేరుతాం అంటూ ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ- కేసీఆర్ ఇద్దరూ ఒకే కూటమి కోసం ప్రయత్నం చేస్తున్నారా? లేదా, ఎవరికి వారు తమ పెత్తనం చెల్లుబాటు కావడానికి రెండు మార్గాల్లో మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారా? అనేది మాత్రం స్పష్టత లేదు. కేసీఆర్ బెంగాల్ పర్యటన తర్వాత.. ఇద్దరూ కలిసి జమిలిగా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. తమ ఇద్దరి ప్రయత్నాలూ ఒకే కూటమికోసం అనే మాట కూడా అనలేదు.

ఈ నేపథ్యంలో మమతా కూటమిలో చేరబోతున్నాం అని ప్రకటించిన డీఎంకేను కేసీఆర్ తన ఫెడరల్ కూటమి వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంత మేరకు సఫలం అవుతారో వేచిచూడాలి.