Begin typing your search above and press return to search.

కొడుకు మీదే కేసీఆర్ నిఘా పెట్టారా?

By:  Tupaki Desk   |   18 July 2016 8:17 AM GMT
కొడుకు మీదే కేసీఆర్ నిఘా పెట్టారా?
X
వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని చెబుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు. సంచలనం రేకెత్తిస్తున్న సదరు కథనంలోని అంశాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ఛాంబర్ మీద.. తనకు సన్నిహిత మంత్రులుగా పేర్కొన్న వారి పేషీల మీద మూడో కన్ను వేశారని చెబుతున్నారు. తన కుమారుడితో పాటు.. పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరైన తన మేనల్లుడు హరీశ్ రావు ఛాంబర్ మీద కూడా కేసీఆర్ డేగ కన్ను ఉండటం గమనార్హం.

ప్రభుత్వానికి మూల స్థంభాలైన తన కొడుకు.. మేనల్లుడు..కీలక మంత్రులైన ఈటెల రాజేందర్.. ఉప ముఖ్యమంత్రులు మహ్మద్ అలీ.. కడియం శ్రీహరిల ఛాంబర్లపైనా కేసీఆర్ కన్నేసినట్లుగా కథనాలు రావటం ఆసక్తికరంగా ఉన్నాయి. తమ వాదనకు నిదర్శనంగా వారు కొన్ని ఉదంతాల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన నిఘా అధికారులు.. సామాన్యుల మాదిరిగా వారి పేషీల వద్దకు రావటం.. తమ పనుల పరిష్కారం కోసం పలువురిని సంప్రదించటం లాంటివి చేస్తూ.. ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.

కొన్ని పేషీల్లో అవినీతి ఎక్కువగా ఉందని.. ఫైళ్లు ఏమైనా సరే.. పైసలిస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ సదరు పేషీ సిబ్బంది వ్యవహరిస్తున్ననేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా చేయటంతో పాటు..సదరు మంత్రులకు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఈ పని చేపట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అధికారపక్షంలో కీలక నేతలు పేరున్న నేతల మీద ఏదైనా ఆరోపణ వస్తే అది ప్రభుత్వానికి నష్టం కలిగించటం ఖాయమని.. అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండటానికే కేసీఆర్ ఈ పని చేసినట్లుగా చెబుతున్నారు. వారందరికి ఇదో మేలుకొలుపుగా కొందరు టీఆర్ ఎస్ నేతలు వ్యాఖ్యానించటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొడుకు.. మేనల్లుడితో సహా అందరికి కేసీఆర్ అంటే హడల్ అని.. ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం చేయరని.. ఆయన్ను పూర్తిగా నమ్మే వారి విషయంలోనూ కేసీఆర్ ఇంత కఠినంగా వ్యవహరించటం ఏమిటన్న మాట పలువురి నోటి నుంచి వస్తుంటే.. దానికి బదులుగా ఒక టీఆర్ ఎస్ సీనియర్ నేత చెప్పిన వాదన ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. త్వరలో కీలక పరిణామాలు తెలంగాణ అధికారపక్షంలో చోటు చేసుకుంటాయని.. ఒకవేళ ఇది కొద్ది నెలలు ఆలస్యంగా అయినా జరిగేదని.. అలాంటి వేళ తాను పూర్తిగా విశ్వసిస్తున్న వారిపై ఎలాంటి మరకా పడకుండా ఉండేలా చూసేందుకే కేసీఆర్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని ఉంటారని ఆయన విశ్లేషించారు. అంతేకాదు.. తనకు అత్యంత సన్నిహితుల్లో లోపాల్ని తన చర్యల ద్వారా కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెబుతున్నారు. వాస్తవానికి నిఘా కొడుకు.. మేనల్లుడు.. కీలక నేతల మీద కాదని.. వారి పేషీల మీద.. వారి సిబ్బంది మీదనన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ ఆ నేత వ్యాఖ్యలు చేయటాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.